''నేను హైస్కూల్ చదివేటప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆమెతోనే జీవితం అనుకున్నా. కాలేజీ చదివాక మరో అమ్మాయిని ప్రేమించాను. ఆ తర్వాత ఇంకో అమ్మాయిని.. 'ప్రేమమ్' చిత్రంలో కూడా ముగ్గురిని ప్రేమిస్తాను. కానీ రియల్‌లైఫ్‌లో లెక్చరర్‌ను ప్రేమించలేదు. సినిమాలో అలా ప్రేమించాల్సి వచ్చింది'' అని అక్కినేని నాగచైతన్య సినిమాలో తన పాత్రను విశ్లేషించారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మలయాళ హిట్ సినిమా 'ప్రేమమ్'కు రీమేక్. ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్బంగా నాగ చైతన్య చెప్పిన విశేషాలు.
మీ పర్సనల్ లైఫ్ సినిమాకు ఆటంకం అవుతుందా?
అలా అవ్వకూడదని అనుకుంటాను. ఈ సినిమా విడుదలయ్యేనాటికి నేను సమంతను పెళ్లిచేసుకుంటున్నాననేది బయటకు వచ్చింది. ప్రేక్షకులు సినిమా కోణంలో చూడాలని కోరుకుంటున్నా.
సమంతనే హీరోయిన్‌గా పెట్టుకోవచ్చుగదా?
ఇద్దరం కలిసి ఓ సినిమా చేయబోతున్నాం. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాం.
ఇక ప్రేమమ్ సినిమా గురించి చెప్తారా?
మొదట సినిమా మొదలుపెట్టినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2, 3 నెలల తరువాత జనాలకు సినిమా బాగా కనెక్టయింది. ఒరిజినల్ వెర్షన్‌ని మించిపోవాలని, అందులో ఉన్న తప్పుల్ని ఇందులో సరిచేయాలని సినిమా చేయలేదు. ఇది అందరికీ నచ్చే కథ కాబట్టి చేశాను. దానికి దీనికి తేడా ఉంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని కొన్ని మార్పులు చేశాం.
సినిమా నిడివి తగ్గించడానికి కారణం?
మలయాళీలు కావ్యంగా, స్లోగా ఉండే కథనాన్ని ఇష్టపడతారు. కానీ మన వాళ్లకి కాస్త స్పీడ్ ఉండాలి. ఎక్కువ రన్ టైం ఉంటే కష్టం. అందుకే తగ్గించాం.
కథలో ఉండే మూడు లవ్ స్టోరీల్లో దేనిలో ఎక్కువ మార్పులు చేశారు ?
నేను స్కూల్లో, కాలేజీలో ఆ తర్వాత ముగ్గురిని ప్రేమించాను. అది సినిమా కథలోనూ వుండటం యాదృశ్చికం. మలయాళ ప్రేమమ్ తీసుకుంటే.. స్కూల్ లవ్‌లో, కాలేజీ లవ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ మూడో లవ్ స్టోరీలో మాత్రం ఎక్కువ మార్పులు చేశాం. మన తెలుగువాళ్లకి నచ్చేలా ఉండాలనే ఆ ప్రయత్నం.
మీరెక్కువగా రీమేక్ కథనే ఎందుకు తీసుకొచ్చారు?
వాస్తవంగా ఇది నా నిర్ణయమే. దర్శకుడితో స్ట్రెయిట్ సినిమానే చేయాల్సింది. అతనితో పరిచయమేర్పడిన తరువాత చేసిన 2, 3 నెలల ప్రయాణంలో చాలా చర్చలు జరిగాయి. నేనే ఈ సమయంలో నాకు ఈ కథ అయితేనే బాగుంటుందని రీమేక్ చేయమన్నాను. అలా కుదిరింది. త్వరలో అతినితో ఓ డైరెక్ట్ సినిమా చేయాలి.
యాక్షన్ సినిమాలను దూరం పెట్టినట్టేనా?
నాకు యాక్షన్ సినిమాలంటేనే ఎక్కువ ఇష్టం. కానీ ఇంతకుముందు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. ఇంకా ఆ మెచ్యూరిటీ రాలేదని నా నమ్మకం. ఒక రెండు హిట్లు కొట్టాక, నా మీద నాకు నమ్మకం ఏర్పడ్డాక యాక్షన్ సినిమా చేస్తాను.
ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు?
'మనం' సినిమా తరువాత నాకు అంత బాగా నచ్చిన సినిమా ఇది. కథ అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. పైగా ప్రేమ కథలు నాకు బాగా సూటవుతాయి. చాలా ఇష్టపడి సినిమా చేశాను. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందనే గట్టి నమ్మకం నాకుంది.
ఒరిజినల్ వెర్షన్‌లో హీరో పాత్రను చూసి ఏం నేర్చుకున్నారు?
అందులో నవీన్ చాలా బాగా చేశాడు. ముఖ్యంగా అతని ప్రవర్తన నచ్చింది. నేను కూడా అదే యాటిట్యూడ్ నేర్చుకున్నాను. సినిమా చూసి చాలా హోమ్ వర్క్ చేశాను.
పెద్ద డైరెక్టర్లతో సినిమాలు ఎప్పుడు చేస్తారు?
చిన్న, పెద్ద దర్శకులనే తేడా ఉండదు. కథ ప్రాధాన్యత, నన్ను మెప్పించే విధంగా ఎవరు తెచ్చినా సినిమా చేస్తా. అలాగే ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు ఎవరు వచ్చి కథ చెప్పినా అది బాగుంటే ఖచ్చితంగా సినిమా చేస్తా.
సమంతను ప్రేమిస్తున్నట్టు ముందుగా ఎవరికి చెప్పారు?
మా ప్రేమ విషయం ముందు నా స్నేహితులకే తెలుసు. ఆ తరువాత నేనే నాన్నకు చెప్పా. అప్పుడాయన నవ్వుతూ ఈ విషయం నాకు ముందే తెలుసులేరా అన్నారు, ఒప్పుకున్నారు. ఇప్పుడు అంతా చాలా హ్యాపీగా ఉన్నాం.
అఖిల్ ప్రేమ సంగతి చెప్పాక ఎలా ఫీలయ్యారు?
అఖిల్ ప్రేమ అస్సలు ఊహించలేదు. చెప్పగానే ఆశ్చర్యపోయాం. కానీ చిన్న వయసే అయినా బాధ్యతగా మాకొచ్చి చెప్పడంతో హ్యాపీగా అనిపించింది. నాన్నగారు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు.
మరి మీ పెళ్లిళ్లు ఎప్పుడు?
నిశ్చితార్థం, పెళ్లి వచ్చే సంవత్సరమే ఉంటాయి. అఖిల్‌ది కూడా అంతే. కానీ నాకన్నా అఖిల్ పెళ్లి ముందు జరుగుతుంది.
సోషల్ మీడియాలో మీ పెళ్లి గురించి అంత చర్చ జరుగుతుంది కదా మీరు త్వరగా రియాక్ట్ కాలేదు ఎందుకు?
నేను ఒక పాలసీ పెట్టుకున్నాను. సోషల్ మీడియాలో కేవలం సినిమాల గురించే మాట్లాడాలని. అందుకే త్వరగా రియాక్ట్ కాలేదు. నేను చాలా ప్రైవేట్. ఏదన్నా అవసరం ఉంటే తప్ప బయటకి రాను. అందుకే పెద్దగా రియాక్ట్ అవలేదు.
వివాహానంతరం సమంత సినిమాలకు దూరంగా వుంటుందా?
అలాంటిది ఏమీలేదు. తను తనకు నచ్చిన సినిమాలు చేస్తుంది. నేనెప్పుడూ అభ్యంతరం పెట్టను అని చెప్పారు.