శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 17 మే 2017 (08:01 IST)

ధోనీ వీరబాదుడుకు టీమ్ యాజమాన్యం స్టాండింగ్ ఒవేషన్.. సాక్షి మనసు చల్లబడి ఉంటుందా?

టీమ్ యాజమాన్యం అహంకారంతో ఐపీఎల్ -10 సీజన్ ప్రారంభంలో ఘోర అవమానానికి గురైన ధోనీ తనకే సాధ్యమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపుకు అవసరమైన పరుగులను మెరుపు వేగంతో సాధించి జట్టును అమాంతంగా పైకి లేపాడు. ధోనీ స్ఫూర్తితో పుణే జట్టు బౌలర్లు విజృంభించి ముంబై ఇండియన

చావో రేవో తేలాల్సిన కీలక సమయంలో ముంబై ఇండియన్స్ వంటి పటిష్ట జట్టుపై నిర్ణయాత్మక విజయం సాధించిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టు ఐపీఎల్ 10 సీజన్‌ను శోభాయమానం చేసింది. అసాధ్యం అనుకున్న చోటే ముంబై ఇండియన్స్ టీమ్‌ను వారి సొంత గ్రౌండ్‌లోనే చిత్తు చేసిన పుణే జట్టు నేరుగా పైనల్‌లో ప్రవేశించింది. ఆటలో గెలుపోటములు సహజమే, ఏదో ఒక జట్టు ఓడిపోవడమూ సహజమే కానీ టీమ్ యాజమాన్యం అహంకారంతో ఐపీఎల్ -10 సీజన్ ప్రారంభంలో ఘోర అవమానానికి గురైన ధోనీ తనకే సాధ్యమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపుకు అవసరమైన పరుగులను మెరుపు వేగంతో సాధించి జట్టును అమాంతంగా పైకి లేపాడు. ధోనీ స్ఫూర్తితో పుణే జట్టు బౌలర్లు విజృంభించి ముంబై ఇండియన్స్ దిగ్గజ బ్యాట్స్‌మన్ లను వెంటవెంటనే ఔట్ చేయడంతో విజయం మొదటే పుణే సూపర్ జెయింట్ జట్టువైపు మొగ్గు చూపింది. 
 
ముంబై ఇండియన్స్ జట్టు  అంత సులభంగా విజయాన్ని పుణే జట్టుకు కట్టబెట్టలేదు. బౌలర్లు అద్భుతంగా కట్టడి చేయడంతో 18 ఓవర్లు ముగిసేసరికి పుణే స్కోరు 121 పరుగులు మాత్రమే. అయితే చివరి రెండు ఓవర్లలో ఆ జట్టు 41 పరుగులు రాబట్టడం విశేషం. మెక్లీనగన్‌ వేసిన 19వ ఓవర్లలో ధోని 2 భారీ సిక్సర్లు బాదగా, తివారి 6, 4 కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. బుమ్రా వేసిన చివరి ఓవర్లో నమ్మశక్యం కాని విధంగా ధోని మరో 2 సిక్సర్లు కొట్టడంతో పుణే 15 పరుగులు సాధించింది. 
 
ధోని విలువ మరోసారి టీమ్ యాజమాన్యానికి అర్ధమైనట్లుంది. రన్ రేట్ బాగా తగ్గిపోవడంతో కీలకమైన చివరి రెండు ఓవర్లలో పుణే ఫ్రాంచైజీ యజమానులు మునివేళ్లపై నిలబడి చప్పట్లతో ప్రోత్సహిస్తూ ఉండగా ధోని మెరుపు సిక్సర్ల ప్రదర్శన పుణేను మెరుగైన స్థితిలో నిలిపాయి. అనంతరం 17 ఏళ్లు కుర్రాడు వాషింగ్టన్‌ సుందర్‌ ముగ్గురు ముంబై స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌ చేసి మ్యాచ్‌ను పుణే చేతుల్లోకి తెచ్చేశాడు. ధోనీ చివరలో సిక్సర్ల మోత మోగించి ఉండకపోతే ముంబై ఇండియన్స్‌కే గెలుపు ఖాయమయ్యేది. 
 
తన భర్తను అవమానించేసరికి తట్టుకోలేకపోయిన ధోనీ అర్ధాంగి సాక్షి ధోని పాత టీమ్ అయిన చెన్నయ్ లోగో కలిగిన హెల్మెట్ పెట్టుకుని మరీ భర్తకు మద్దతుగా నిలిచి పుణే టీమ్ యాజమాన్యాన్ని ఏకిపడేసింది. మంగళవారం తన భర్త ప్రదర్శనకు ఫిదా అయిపోయి మునిగాళ్ల మీద నిలబడి మరీ సలామ్ చేసిన జట్టు యాజమాన్యాన్ని టీవీలో చూసిన సాక్షి మనసు చల్లబడి ఉంటుందని నెటజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
 
ఐపిఎల్‌లో ముంబై జట్టుపై ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ధోనీ నిలిచాడు. 536 పరుగులతో అంతకుముందు వరకు రెండో స్థానంలో ఉన్న శిఖర్ ధావన్‌ను మూడో స్థానానికి నెట్టాడు. 708 పరుగులతో రైనా మొదటి ప్లేస్‌లో ఉన్నాడు.
 
ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
1) సరేశ్ రైనా - 708 పరుగులు
2) ధోనీ - 541 (మ్యాచ్‌లో 17 ఓవర్లు ముగిసే సమయానికి)
3) ధావన్ - 536
4) షాన్ మార్ష్ - 526
5) డివీలియర్స్ - 510
 
లీగ్‌లో రెండో ఏడాదే ఫైనల్‌ చేరి సత్తా చాటిన స్మిత్‌ సేన, ఆదివారం హైదరాబాద్‌లో జరిగే ఫైనల్‌కు అర్హత సాధించగా, ముంబైకి రెండో క్వాలిఫయర్‌ రూపంలో టైటిల్‌ పోరుకు చేరేందుకు మరో అవకాశం ఉంది.