కరోనాపై తప్పుడు వార్తలు.. 70లక్షల పోస్టులను డిలీట్ చేసిన ఫేస్‌బుక్
సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ కరోనా గురించి తప్పుడు వార్తలలో పెట్టిన 70 లక్షల పోస్టులను తొలగించినట్లు తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ నెలల కాలంలోనే ఆయా పోస్టులను తొలగించినట్లు తెలిపింది. కరోనాపై కొందరు కావాలని తప్పుడు వార్తలను ప్రచారం చేశారని, అలాంటి వార్తలకు చెందిన పోస్టులను తాము తొలగించామని ఫేస్‌బుక్ తెలిపింది.
కాగా ఆయా నెలల్లో హేట్ స్పీచ్‌కు సంబంధించి 22.5 మిలియన్ల పోస్టులను తొలగించినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. జనవరి నుంచి మార్చి నెలల కాలంలో అలాంటి పోస్టులను 9.6 మిలియన్ల వరకు తొలగించింది. ఇక రెండో త్రైమాసికంలో టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు చెందినవిగా చెప్పబడిన 8.7 మిలియన్ల పోస్టులను తొలగించారు. గతంలో అవే పోస్టులను 6.3 మిలియన్ల వరకు తొలగించారు.
అయితే ఫేస్‌బుక్‌లో ఆయా పోస్టులను గుర్తించి వాటిని డిలీట్ చేసేందుకుగాను ఆటోమేషన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అన్ని పోస్టులను మాన్యువల్‌గా గుర్తించి డిలీట్ చేయడం కష్టం కనుక అలా చేస్తున్నట్లు వెల్లడించింది.