శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 మే 2017 (12:23 IST)

ట్రంప్ దెబ్బకు రోడ్డునపడుతున్న భారతీయ టెక్కీలు... 3-4 యేళ్ళలో కోటి మందికి ఉద్వాసన

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయ టెక్కీలు రోడ్డు పడుతున్నారు. ఇప్పటికే, కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుక

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయ టెక్కీలు రోడ్డు పడుతున్నారు. ఇప్పటికే, కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే చర్యలు చేపట్టింది. వీరిలో ఎక్కువ మంది భారతీయ టెక్కీలే ఉన్నారు. తీసేస్తున్న ఉద్యోగుల స్థానంలో అమెరికా పౌరులను తీసుకునేందుకు ఇన్ఫోసిస్ ఇప్పటికే సిద్ధమైంది. తమ సంస్థలో పనితీరు బాగాలేని టెకీలను ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 
 
వ్యక్తిగత లక్ష్యాల సాధన, సంస్థ లక్ష్యాలు, ఇతర వ్యూహాత్మక అంశాల ఆధారంగా పనితీరు అంచనాలు ఉంటాయని అందులో పేర్కొంది. పనితీరు ఆధారంగా మార్పుచేర్పులు చేయడం ఏటా సాధారణంగా చేసే పనే అని ఇన్ఫోసిస్‌ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఈసారి ఆ సంస్థ ఎంతమందిని తీసేస్తున్నారో స్పష్టంగా తెలుపనప్పటికీ.. సీనయిర్, జూనియర్ స్థాయుల్లో కొన్ని వందల మంది ఉద్యోగాలు పోబోతున్నాయని, భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్నవారిపైనా వేటు ఉండొచ్చని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
మరోవైపు.. టెక్‌మహీంద్రా ఇప్పటికే వందలాది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను మొదలుపెట్టింది. ఇటీవలే వార్షిక పనితీరు మదింపును ప్రారంభించింది. పనితీరు బాగా లేని వారిని ఏటా తొలగించడం జరుగుతూ ఉంటుందని, ఈ ఏడాది అదే జరుగుతోందని టెక్‌ మహీంద్రా స్పష్టం చేసింది. కానీ, ఈసారి పరిస్థితి వేరని.. ఉద్యోగాలు పోయే ఉద్యోగుల సంఖ్య వందల్లోనే ఉంటుందని నిపుణులు అంటున్నారు.
 
ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల వచ్చే 3-4 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటి ఉద్యోగాలు గల్లంతవుతాయని ప్రపంచ ఆర్థిక వేదిక హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో సగం ఉద్యోగాలు కనుమరుగవుతాయని వెల్లడించింది. ఆటోమేషన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌, త్రీడీ ప్రింటింగ్‌, అత్యాధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థల వల్ల ఇప్పుడున్న చాలా ఉద్యోగాలు 2020కి కనుమరుగవుతాయని పేర్కొంది. 
 
ప్రస్తుతం ఉద్యోగులు ఉన్న కొలువులను కాపాడుకుంటూ.. కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలని.. లేకుంటే ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాదైనా ఉద్యోగం ఊడక తప్పదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇప్పటివరకూ ఒక ఉద్యోగం పోతే.. రెండు కొత్త ఉద్యోగ అవకాశాలు ఉండేవి. దీంతో ఒకచోట పోయినా.. మరో చోట వెదుక్కొనేవారు. కానీ ఇకపై పరిస్థితి అలా ఉండదని వారు చెపుతున్నారు. 
 
ఇతర ప్రముఖ సంస్థల అంచనా మేరకు మరో మూడు నుంచి నాలుగేళ్లలో ప్రపంచంలో కోటి ఉద్యోగాలు పోతాయి. ఇటీవలి పరిస్థితుల ప్రకారమైతే వీటి స్థానంలో రెండు కోట్ల కొలువులు అందుబాటులో ఉండాలి. కానీ ఇకపై అలా ఉండదు. కేవలం 30-50 లక్షల కొలువులే వస్తాయి. దీంతో దాదాపు 50 లక్షల మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా ఇప్పుడు ఉన్న స్కిల్స్‌ ఇకపై పనికిరావనీ, అందువల్ల కొలువుల్లో ఉండే వారు కూడా తమ ప్రతిభకు నిరంతరం పదును పెట్టుకోవాల్సి ఉందని చెపుతున్నారు.