గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (15:46 IST)

చైనాకు చెక్ పెట్టండి.. మైక్రోమ్యాక్స్‌కు సూచన.. మార్కెట్లోకి 3 ఫోన్లు

Micromax smartphone
మైక్రోమ్యాక్స్ నుంచి మూడు కొత్త ఫోన్లు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి. కొత్త ఫోన్లలో ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫోన్ కూడా ఉందని ట్విట్టర్‌లో మైక్రోమ్యాక్స్ తెలిపింది. గత సంవత్సరం అక్టోబర్‌లో ఐవన్ నోట్‌ను విడుదల చేసిన తరువాత మైక్రోమ్యాక్స్ మరో కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేయలేదు. ట్విట్టర్‌లో వినియోగదారులు అడిగిన పలు ప్రశ్నలకు మైక్రోమ్యాక్స్ సమాధానమిచ్చింది.
 
ఈ నేపథ్యంలోనే ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్ల ధరలన్నీ రూ.10 వేల లోపే ఉంటాయని, ట్విట్టర్‌లో సంస్థ ప్రకటించింది. ఇదే సమయంలో చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త స్మార్ట్ ఫోన్లను తయారు చేయాలని పలువురు సంస్థకు సూచించగా, తాము ఆ పనిలోనే ఉన్నామంటూ సానుకూల సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం మనదేశంలో చైనా వ్యతిరేక పవనాలు తీవ్రస్థాయిని చేరడంతో దీన్ని మైక్రోమ్యాక్స్ సద్వినియోగం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా, మైక్రోమ్యాక్స్ ఒకప్పుడు మనదేశంలోని మొబైల్ ఫోన్ మార్కెట్లో ముందంజలో ఉండేది. 2014 మూడో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా టాప్-10 బ్రాండ్లలో కూడా స్థానం సంపాదించుకుంది. అయితే తర్వాత షియోమీ వంటి చైనీస్ బ్రాండ్ల దండయాత్ర కారణంగా మార్కెట్ పై పట్టు కోల్పోయింది. ఇప్పుడు మూడు కొత్త ఫోన్లతో మళ్లీ పునర్వైభవం సంపాదిస్తుందేమో చూడాలి.