ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2024 (10:04 IST)

టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్ దాడి... బ్యాంకు సేవలకు అంతరాయం!!

cyber attack
భారతదేశ వ్యాప్తంగా పలు బ్యాంకులకు సాంకేతిక పరిజ్ఞానం అందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్ దాడి జరిగింది. దీంతో భారత్‌లోని  దాదాపు 300 స్థానిక బ్యాంకుల లావాదేవీలకు తాత్కాలిక అంతరాయం కలిగింది. దీనికి సంబంధించి వార్తా ఏజెన్సీ సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. భారత్‌లోని పలు చిన్న బ్యాంకులకు బ్యాంకింగ్ టెక్నాలజీ సిస్టమ్లు అందించే సి-ఎడ్జ్ టెక్నాలజీపై ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. అయితే, దీనిపై సి-ఎడ్జ్ టెక్నాలజీస్ గానీ, ఆర్బీఐ గానీ స్పందించలేదు.
 
చెల్లింపు వ్యవస్థలను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం ర్యాన్సమ్వేర్ దాడి ఘటన తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. కోపరేటివ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు టెక్నాలజీ సేవలు అందించే సి-ఎడ్జ్ టెక్నాలజీపై ర్యాన్సమ్‌వేర్ దాడి ఘటనతో కొన్ని చెల్లింపు వ్యవస్థలపై ప్రభావం పడినట్లు ఒక పబ్లిక్ అడ్వైజరీ విడుదల చేసింది. 
 
మిగతా చెల్లింపులు వ్యవస్థలపై దీని ప్రభావం పడకుండా ఉండేందుకు రిటైల్ పేమెంట్స్ సిస్టమ్తో సి-ఎడ్జ్ టెక్నాలజీసు తాత్కాలికంగా వేరుచేసినట్లు వెల్లడించింది. ఈ సంస్థ సేవలు అందిస్తున్న సదరు బ్యాంకుల ఖాతాదారులు ఈ ఐసోలేషన్ సమయంలో సేవలు పొందలేరని తెలిపింది. పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, అవసరమైన సెక్యూరిటీ రివ్యూ జరుపుతున్నట్లు చెప్పింది. చెల్లింపులు నిలిచిపోయిన బ్యాంకులు సాధ్యమైనంత త్వరగా పనిచేస్తాయని తెలిపింది.