కృష్ణా నది నీటిలో ఈ-కోలీ బ్యాక్టీరియా... టైఫాయిడ్, డయారియా వచ్చే అవకాశం...
గుంటూరు: కృష్ణా పుష్కరాలకు ముందే ప్రభుత్వానికి సవాల్ ఎదురైంది. పుష్కర ప్రధాన ఘాట్లలో ఒకటైన గుంటూరు సీతానగరం ఘాట్‌లో నీళ్లు పుణ్యస్నానానికి సురక్షితం కాదని నిపుణులు తేల్చారు. నది నీళ్లను సేకరించి పరీక
గుంటూరు: కృష్ణా పుష్కరాలకు ముందే ప్రభుత్వానికి సవాల్ ఎదురైంది. పుష్కర ప్రధాన ఘాట్లలో ఒకటైన గుంటూరు సీతానగరం ఘాట్‌లో నీళ్లు పుణ్యస్నానానికి సురక్షితం కాదని నిపుణులు తేల్చారు. నది నీళ్లను సేకరించి పరీక్షించగా, ఇందులో ప్రమాదకరమైన కోలీ బ్యాక్టీరియా (ఈ-కోలీ) ఉన్నట్లు పాజిటివ్ నివేదిక వచ్చింది. దీంతో హుటాహుటిన స్పందించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన బ్లీచింగ్, క్లోరిన్ ట్రీట్‌మెంట్ ప్రారంభించారు.
మనిషి మల, మూత్రాలతో కలుషితమైన నీటిలో ఈ బ్యాక్టీరియా పెరుగుతుందని, ఇది ఉన్న నీటిని తాగినా, స్నానానికి వినియోగించినా ఎంట్రిక్ ఫీవర్(టైఫాయిడ్), డయేరియా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు వెల్లడించారు. విజయవాడకు చెందిన ప్రైవేటు సంస్థ వాటర్ ఎనలిస్టులు సీతానగర్ ఘాట్‌లో నీటిని సేకరించి పరీక్షించారు. ఇందులో ఈ-కోలీ ఉన్నట్లు తేలింది. దీంతో నీటి నమూనాలను గుంటూరు వైద్య కళాశాలలో సివిల్ సర్జన్(బ్యాక్టీరియాలజిస్ట్) డాక్టర్ బీవీ సుధీర్ నేతృత్వంలో పరీక్షలు జరిపారు. నీటిలో ప్రమాదకరమైన ఈ-కోలీ ఉన్నట్లు గుర్తించారు.
అయితే, ''నీటిలో ఈ-కోలీ ఉన్నంత మాత్రాన ఆందోళన అవసరం లేదు. బ్లీచింగ్, క్లోరిన్ ట్రీట్‌మెంట్‌తో నీటిని శుద్ధిచేయవచ్చు'' అని డాక్టర్ సుధీర్ చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో భక్తులకు నీటి ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ సంయుక్తంగా అన్ని ఘాట్లలో ఎడ్జ్ క్లోరినేషన్ నిర్వహించనున్నాయి. ప్రతి 4 గంటలకు ఒకసారి క్లోరినేషన్ చేస్తారు. నీటిలో క్లోరిన్ శాతం ఎంత ఉందో తరచూ, పరిశీలించేందుకు ఎంపీహెచ్ఎస్‌లను అన్ని ఘాట్ల వద్ద నియమిస్తారు. నీటిలో రెసిడ్యుయల్ క్లోరిన 0.5 నుంచి 1.0 పీపీఎం ప్రమాణాల్లో ఉండాలి.
అంతకంటే తగ్గితే నీటి నమూనాలకు నైట్రైడ్స్, అమ్మోనికల్ నైట్రోజన్ పరీక్షలు నిర్వహిస్తారు. కృష్ణా నది నీళ్లు భక్తులు స్నానం చేసేందుకు అనువుగా ఉన్నాయో.. లేదో.. నిర్ధారించేందుకు ఆరోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ నీటిలో ఏశ్చరీషియా కోలీ తదితర బ్యాక్టీరియాల ఉనికిని తెలుసుకునే కల్చర్ పరీక్షలు జరిపేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) ఆధ్వర్యంలో వాటర్ ఎనలిస్టుల వైద్య బృందం రంగంలోకి దిగింది. ఐపీఎం నుంచి 32 మంది నిపుణుల బృందాన్ని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వివిధ ఘాట్ల వద్ద నియమిస్తారు.