‘మెగా’ అన్నయ్యకి తమ్ముడు మద్దతు ఇచ్చాడు... మరి తమ్ముడికి...??
మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యం పేరిట పార్టీ పెడితే... ‘యువరాజ్యం’ అధ్యక్షుడుగా పవన్‌కల్యాణ్ చేసిన ప్రచారం ఎంత జోరుగా ఉండిందో అందరికీ తెలిసిన విషయమే! అప్పట్లో అన్న బాటలో నడిచిన పవన్ రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రచారం చేసారు.
‘ఇదేం రాజ్యం.. ఇదేం రాజ్యం.. దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం.. పంచెలూడిపోయేలా తరిమి తరిమి కొట్టండి’.... అంటూ నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపైనా, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ పర్యటించిన పవన్ తర్వాత కాలంలో అన్నతో విభేదించి ప్రస్తుతం జనసేన పేరిట సొంతంగా పెట్టుకున్న పార్టీతో, రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలకు ధీటుగా ఎన్నికల యుద్ధానికి కాలు దువ్వుతున్నారు.
అప్పట్లో ఆయన అన్నకు తోడుగా నిలిచారు. కాగా... అప్పట్లో పెద్దగా క్రియాశీలంగా వ్యవహరించని మరో మెగా బ్రదర్ నాగబాబు.. ఈసారి ఏకంగా ఎంపీగా పోటీలో ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ‘తమ్ముళ్ల’కు అన్నయ్య తోడుగా నిలుస్తారా? అంటే.. అటువంటి దాఖలాలేమీ కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల ప్రచారం మొదలై చాలా రోజులు గడిచిపోయాయి.
ప్రచారంలో పాల్గొనడం సంగతి అటుంచి.. మెగా అన్నయ్య... చిరంజీవి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ‘జనసేన’కు మద్దతుగా మాట్లాడింది లేదు. మౌనంగానే ఉంటున్నారు. ఒక్క చిరంజీవే కాకుండా.. మెగా ఫ్యామిలీ హీరోలెవ్వరూ ప్రచారం ఊసెత్తకపోవడం ఇక్కడ గమనార్హం.
ఎంపీగా పోటీ చేస్తున్న నాగబాబు తరఫున కూడా సాక్షాత్తూ ఆయన కుమారుడు వరుణ్ తేజ్ సైతం ప్రచారంలో పాల్గొనట్లేదు. షూటింగ్ నిమిత్తం వరుణ్ విదేశాల్లో ఉన్నాడు కాబట్టి రావడం కుదరలేదేమోననుకున్నా.. రామ్‌చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ ఇలా అందరూ ప్రచారానికి దూరంగానే ఉంటున్నారు. ఈ ప్రచారానికి సంబంధించి ఇటువంటి ప్రశ్నలు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి సైతం ‘సైరా’ షూటింగ్‌లో బిజీ అయిపోయారనే గుసగుసలూ వినపడుతున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన ప్రచారంలో పాల్గొనవద్దని చిరంజీవి, అల్లు అరవింద్ మెగాహీరోలకు అల్టిమేటమ్ జారీ చేయడమే ఇందుకు కారణమని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. ఆ లోటు తెలియకుండా చివర్లో మెరుపులా ఒకే ఒక్కసారి రామ్ చరణ్‌ను మాత్రం రంగంలోకి దించి ప్రచారం చేయిస్తారేమో మరి ఇంకొన్నాళ్లు వేచి చూద్దాం...