శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Hanumantha Reddy

ఆహ్లాదకరం హార్సిలీ హిల్స్ అనుభవం

WD PhotoWD
ఆంధ్రప్రదేశ్‌లోని అనేక పర్యాటక కేంద్రాల్లో హార్సీలీ హిల్స్ ఒకటి. ప్రశాంత వాతావరణంతో ఆహ్లాద పరిచే ఈ హిల్ సముదాయం సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తుంది. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకున్నవారు ఖచ్చితంగా విడిదిచేసే ప్రాంతం హార్సిలీహిల్స్. భారతదేశంలో తెల్ల దొరల హవా సాగుతున్న కాలంలో కడప జిల్లా కలెక్టర్ డబ్ల్యూ.డి. హార్సిలీహిల్స్ ఈ ప్రదేశానికి తరుచూ వచ్చేవారని ఆయన పేరునే హార్సీలీహిల్స్‌కు నామకరణం చేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఇక్కడి పరిస్థితులు వేసవి తాపాన్ని చల్లార్చేవిగా ఉన్నప్పటికీ ఎటువంటి కాలాల్లోనైనా మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే వాతావరణాన్ని కలిగి ఉండటం హార్సిలీహిల్స్ ప్రత్యేకత. ఇక్కడ చెట్ల మధ్య ఎత్తైన శిలలు ఈ ప్రాంతానికి అందాన్నివ్వడమేకాక కొత్త లోకానికి తీసుకెళ్ళేందుకు స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తాయి.

ఒక్కసారి ఈ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత మళ్లీ చూడాలనిపించడం మరో ప్రత్యేకత. ఇక్కడ సంపంగి వంటి వివిధ రకాల పూల చెట్లు సువాసనలు వెదజల్లుతూ ఆనందాన్ని పంచడం ఒక ఎత్తైతే సుమారు 150 ఏళ్ల నాటి యూకలిప్టస్ చెట్టు 'కళ్యాణి' హార్సిలీహిల్స్ పర్యటనలోనే మరో ఆకర్షణ.

WD PhotoWD
చెంచు జాతికి చెందిన వారు ఎక్కువగా నివసిస్తున్న ఈ ప్రాంతంలో మరొక ఆకర్షణ మల్లమ్మ ఆలయం అని చెప్పవచ్చు. ఇంకా పిల్లలను ఉత్సాహపరిచే అనేక రకాల జంతువులతో ఇక్కడ జంతు ప్రదర్శనశాల కూడ ఉంది. వీక్షకులను అబ్బురపరిచే ప్రాంతాలు.. ఎత్తైన లోయలు.. వాటి మధ్య అక్కడక్కడ పచ్చని చెట్లతో చిన్నచిన్న కొండలు దర్శనమిస్తాయి.

తిరుపతి నుంచి సుమారు 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం మదనపల్లెకు 43 కి.మీల సమీపంలో ఉంది. సముద్ర మట్టం నుంచి సుమారు 1,265 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది.

బెంగుళూరు, తిరుపతి ప్రాంతాలు హార్సిలీహిల్స్‌కు సమీపాన ఉండే విమానాశ్రయాలు. అలాగే రైలు మార్గం ద్వారా మదనపల్లెకు చేరుకుంటే హిల్స్‌కు చేరుకోవటం సులువు. అదేవిధంగా రోడ్డు మార్గం ద్వారా అయితే ప్రతి గంటకు తిరుపతి నుంచి బస్సులు ఉన్నాయి.