శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Ganesh

ఇండియన్ నయాగరా.. ఔషధీ జలపాతం "హొగెనక్కల్"

FILE
కావేరీ నదిమీద ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన హొగెనక్కల్ జలపాతం భారతీయ నయాగరాగా పేరుగాంచింది. తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురికి 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం, వనమూలికల ఔషధ విలువలతో అలరారుతూ సందర్శకులకు ఓ వైపు ఆహ్లాదాన్ని, మరోవైపు ఆరోగ్యాన్ని అందిస్తోంది. దక్షిణ ఆసియాలోనే అతి ప్రాచీన కార్బొనెట్ శిలలు ఉన్న ఈ జలపాతం బోటు షికారుకు కూడా పెట్టింది పేరు.

కన్నడ భాషలో "హొగె" అంటే 'పొగ' అని అర్థం. "క్కల్" అంటే 'రాయి' అని అర్థం. అందుకే హొగెనక్కల్ అంటే పొగలు చిమ్మే రాయి అని అర్థం వస్తుంది. ఇక్కడి జలపాతం నీరు రాళ్లపై పడినప్పుడు లేచే నీటితుంపర్లు పొగలాగా ఉంటుంది. కాబట్టి... పొగతో నిండిన కొండలాగా ఉంటుంది కాబట్టి ఈ జలపాతాన్ని "హొగెనక్కల్" అని పిలుస్తారు. ఇక తమిళ ప్రజలయితే "మరికొట్టాయం" అని ముద్దుగా పిలుచుకుంటారు.

కర్నాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోగల బ్రహ్మగిరి కొండల్లో తలకావేరి వద్ద పుట్టిన కావేరీనది.. తూర్పుదిక్కుగా దిగువకు వేగంగా ప్రవహిస్తుంటుంది. కొండవాలులో ప్రవాహవేగం పెరిగి పిల్లకాలవలను కలుపుకుంటూ ముందుకు సాగుతూ, హొగెనక్కల్ వద్ద ఎన్నో జలపాతాలుగా చీలి పర్వతాల గుండా క్రిందికి ప్రవహిస్తుంటుంది. హొగెనక్కల్ చేరేసరికి కావేరీ నది చాలా విశాలంగా తయారై కొండచరియల మీద పడుతూ చాలా జలపాతాల్ని తయారుచేస్తుంది.
పుట్టిలో సరదాగా...!
గుండ్రంగా 2.24 మీటర్ల వ్యాసార్థంతో, వెదురుతో అల్లిన ఈ తెప్పల్లోకి నీరు ప్రవేశించకుండా కింది భాగం తోలుతోగానీ, ప్లాస్టిక్‌తోగానీ తయారుచేస్తారు. తెడ్డుసాయంతో వీటిని ముందుకు నడుపుతారు. ఈ తెప్పల్లో ఒకేసారి 8 మంది ప్రయాణించవచ్చు...


హొగెనక్కల్ జలపాతంలోని నీరు 20 మీటర్ల ఎత్తునుంచి పెద్ద శబ్దంతో ధ్వనిచేస్తూ క్రిందకు పరుగుతీస్తుంటుంది. ఈ ప్రవాహ ఉధృతికి నీరు తెల్లటి పొగలాగా లేచి ప్రవహిస్తుంటుంది కాబట్టే దానికి హొగెనక్కల్ అనే పేరు వచ్చింది. ఇక్కడ్నించీ దక్షిణంగా ప్రవహించే ఈ జలపాతం నీరు, జలపాతం దాటిన వెంటనే దక్షిణంగా ప్రవహించి మెట్టూరు ఆనకట్ట ద్వారా ఏర్పడిన స్టాన్లీ జలాశయంలో ప్రవేశిస్తాయి.

ఈ జలపాతం పరిసరాలలో ప్రత్యేకంగా నిర్మించిన స్నానఘట్టాలున్నాయి. కొన్ని మైళ్ళు విస్తరించిన నదీజలాలు అడవుల గుండా ప్రయాణించి ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లను తాకుతూ ప్రవహిస్తాయి. అందువలన ఈ నీటిలో స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తారు. ఈ జలపాతం చుట్టూ ఉండే కొండలు కూడా అతి సుందరంగా కనిపిస్తాయి.

హొగెనక్కల్‌కు చేరే కావేరీ నది అడవులగుండా ప్రవహించి, అక్కడి వనమూలికల ప్రభావంతో నిండి ఔషధీ జలాలుగా మారి జలపాతంగా ప్రవహిస్తుంది. హొగెనక్కల్‌కు వెళ్లే దారిలో టెర్రకొట్ట గ్రామంలోని అందమైన తోటలను దర్శించవచ్చు. పట్టుపురుగుల ఆహారమైన మల్బరీ ఆకులతో నిండిన పచ్చటి తోటలతో ఈ పరిసరాలు వనదేవతల్ని సైతం మరిపించేలా ఉంటాయి. గ్రామ సరిహద్దుల్లో యుద్ధవీరుల్ని తలపించేలా ఉండే ఎర్రమట్టితో చేసిన గ్రామదేవతల (అయ్యనార్లు) ఎత్తైన విగ్రహాలు స్వాగతమిస్తాయి.

FILE
వర్షాకాలంలో కావేరీనది పుష్కలమైన నీటితో పొంగి పొర్లుతుంటుంది. నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాలంలో హోగెనక్కల్‌లో బోటింగ్‌కు అనుమతించరు. అయితే వేసవిలో మాత్రం అనుమతిస్తారు. తమిళనాడు, కేరళ తీరప్రాంతాలనుండి స్థానికంగా ఫ్రేముతో అల్లిన గుండ్రని తెప్పలు (పుట్టి) బోటు నిర్వాహకులకు ప్రధానమైన ఆధారం.

ఈ తెప్పలు గుండ్రంగా 2.24 మీటర్ల వ్యాసార్థంతో, వెదురుతో అల్లిన ఈ తెప్పల్లోకి నీరు ప్రవేశించకుండా కింది భాగం తోలుతోగానీ, ప్లాస్టిక్‌తోగానీ తయారుచేస్తారు. తెడ్డుసాయంతో వీటిని ముందుకు నడుపుతారు. ఈ తెప్పల్లో ఒకేసారి 8 మంది ప్రయాణించవచ్చు. ఇలా బోటింగ్ చేస్తున్న దారిలో నీళ్లు, తినుబండారాలు, తాజా చేపల్ని అమ్ముతూ ఉంటారు. ఎడమవైపు ఒడ్డున అప్పటికప్పుడు తాజా చేపలతో వండిన వేడి వేడి వంటకాలను అందించే స్టాల్స్ కూడా ఉన్నాయి.

హొగెనక్కల్ జలపాతంలోని నీరు సన్నటి శబ్దంతో కొండవాలుల గుండా ప్రవహిస్తూ, కిందికి వెళ్లేకొద్దీ ప్రవాహవేగం పెరుగుతుంటుంది. ఈ ప్రవహించే నీటిలో స్త్రీలు బట్టలు ఉతుకుతూ కనిపిస్తారు. అయితే ఇక్కడి ప్రవాహవేగాన్ని బట్టి పుట్టిలను నడపటం, నడపకపోవటం అనేది ఉంటుంది.

అయితే ఈ జలపాతాన్ని సందర్శించేందుకు ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, లోయలు, కనుమలు, తెల్లని వెండిమబ్బులా హోరుగా పారే కావేరీ జలాలలో ప్రయాణం పర్యాటకులకు మరువరాని అనుభూతిని మిగులుస్తుందనటంలో ఎలాంటి సందేహం. ఇక్కడ ఇంకా ఎక్కువసేపు గడపాలనుకునేవారు.. దగ్గర్లోగల దట్టమైన చెట్లతో నిండి ఉండే "మేలగిరి హిల్స్"లో ట్రెక్కింగ్‌ కూడా చేయవచ్చు.

ఎలా వెళ్లాలంటే... వాయు మార్గంలో అయితే బెంగళూరు విమానాశ్రయం హొగెనక్కల్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు మార్గాలను చూస్తే.. సేలం నుంచి 114, బెంగళూరు నుంచి 130 కిలోమీటర్ల దూరంలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఇక హొగెనక్కల్ చుట్టూ అనేక టూరిస్టు బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. వసతి విషయానికి వస్తే.. కర్నాటక రాష్ట్ర పర్యాటకశాఖవారి టూరిస్టు బంగళా, తమిళనాడుకు చెందిన అనేక హోటళ్లు అందుబాటులో ఉన్నాయి.