శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Pavan Kumar
Last Modified: శుక్రవారం, 13 జూన్ 2008 (19:46 IST)

మల్ల రాజుల రాజధాని విష్ణు పూర్

మల్ల రాజుల రాజధాని విష్ణు పూర్. పశ్చిమ బెంగాల్‌లోని బంకూర్ జిల్లాలో ఉంది విష్ణు పూర్. కళలు, సాంస్కృతిక రంగాలకు నిలయం విష్ణు పూర్. బంకూరా జిల్లా రాజధాని విష్ణు పూర్. దాదాపు వెయ్యేళ్ల క్రితం ప్రస్తుతమున్న ప్రాంతాన్ని మల్లభూమ్‌గా పిలిచేవారు. మొఘల్ సామ్రాజ్యం దాడులతో మల్ల రాజులు ఈ ప్రాంతంపై తమ పట్టును కోల్పోయారు. ఇప్పటికీ విష్ణు పూర్ కళలకు మంచి పేరుంది. ప్రాచీన భారతంలో 16 మహాజనపదాల్లో భాగం మల్ల రాజ్యం.

విష్ణు పూర్ టెర్రకోటా దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ దేవాలయాలను మల్ల రాజులు 17, 18 శతాబ్దాల్లో నిర్మించారు. మల్ల రాజులు వైష్ణవులు. బెంగాల్ వాస్తుకళను ప్రతిబింబించేలా ఈ దేవాలయాలను మల్ల రాజులు నిర్మించారు.

విష్ణు పూర్ ఘరానాగా పిలిచే స్థానిక సంగీత పాఠశాల 1370వ సంవత్సరంలో ఏర్పాటైంది. ఇందులో సంగీతంతో పాటుగా వివిధ రకాల టెర్రకోట ఆకృతులు, బల్చూరి చీరలు ఇక్కడ ప్రసిద్ధి. కల్చూరి చీర అంచులపై మహాభారత గాథలను ఇక్కడ నేత పరిశ్రమ వారు చక్కగా నేస్తారు. విష్ణు పూర్ పట్టు చీరలకు ప్రసిద్ధి.

చూడవలసిన ప్రాంతాలు
రస్‌మంచా
మల్ల రాజు వీర హంబీరా 16వ శతాబ్దంలో ఇటుకలతో నిర్మించిన దేవాలయం రస్‌మంచా. దేవాలయ వాస్తు కళ సందర్శకులను అబ్బురపరుస్తుంది.

శ్యామా రాయ్ పంచ రత్న దేవాలయం
రాజా రఘునాథ్ సింఘా 1643లో నిర్మించిన దేవాలయం పంచరత్న టెంపుల్. దేవాలయ గోడలపై శ్రీకృష్ణావతారంలోని వివిధ అంశాలను అద్భుతంగా శిల్పాలుగా తొలిచారు.

జోరే బంగ్లా దేవాలయం
మల్ల రాజు రెండో రఘునాథ్ సింఘా కాలమైన 17వ శతాబ్దంలో జోరే బంగ్లా దేవాలయాన్ని నిర్మించారు. బెంగాల్ వాస్తు కళలో భాగమైన చాలా శైలిని అనుసరించి ఈ దేవాలయం నిర్మించారు.

మదన్ మోహన్ దేవాలయం
రాజా దుర్జన సింగ్ దేవా కాలమైన 1694వ శతాబ్దంలో మదన్ మోహన్ దేవాలయం నిర్మించారు. బెంగాల్ వాస్తు కళలో ఏకరత్న శైలిని అనుసరించి ఈ దేవాలయం నిర్మించటం జరిగింది. పురాణాలు, మహాభారతం, రామాయణంలోని అంశాలను దేవాలయ గోడలపై మలిచారు.

వసతి
వసతికి ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన హోటెల్ ఇక్కడ ఉంది.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : కోల్‌కతా (132 కి.మీ.) సమీపంలో విమానాశ్రయం.
రైలు మార్గం : ఖరగ్‌పూర్-అద్రా రైలు మార్గంలో విష్ణు పూర్ రైల్వే స్టేషన్ ఉంది. కోల్‌కతా నుంచి 201 కి.మీ. దూరంలో ఉంది విష్ణు పూర్.
రహదారి మార్గం : కోల్‌కతా నుంచి 132 కి.మీ. దూరంలో ఉంది విష్ణు పూర్. కోల్‌కతా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (సీఎస్‌టీసీ), సౌత్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎస్‌బీఎస్‌టీసీ) లు కోల్‌కతా నుంచి బస్సులు నడుపుతున్నాయి.