శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (10:00 IST)

ముంబై ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పదిమంది శిశువులు మృతి

ముంబై ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర భాందరా జిల్లా ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది.  సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్‌(ఎస్ఎన్‌యూసీ)లో మంటలు చెలరేగడంతో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ యూనిట్‌లో 17 మంది శిశువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగతా ఏడుగురిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
 
10 మంది నవజాత శిశువులు మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మోదీ ట్వీట్ చేశారు. అగ్నిప్రమాదంలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అమిత్ షా పేర్కొన్నారు. పసిపిల్లల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.
 
భాందరా జిల్లా ఆస్పత్రిలో మరణించిన 10 మంది చిన్నారుల కుటుంబానికి మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆ కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.