శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 29 మార్చి 2017 (07:14 IST)

కశ్మీర్‌లో ప్రమాదకర పరిణామాలు.. సైన్యంపై తిరగబడుతున్న జనం

కశ్మీర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు చేపట్టే సాయుధ చర్యలకు అంతరాయం కలిగించే పౌరులను ఉగ్రవాద సంస్థల మద్దతుదారులుగా పరిగణించి తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీప్ జనరల్ బిపిన్ రావత్ చేసిన హెచ్చరికలకు అనుగుణంగా మంగళవారం సైన్యం ముగ్గురు ఉగ్రవ

కశ్మీర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు చేపట్టే సాయుధ చర్యలకు అంతరాయం కలిగించే పౌరులను ఉగ్రవాద సంస్థల మద్దతుదారులుగా పరిగణించి తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీప్ జనరల్ బిపిన్ రావత్ చేసిన హెచ్చరికలకు అనుగుణంగా మంగళవారం సైన్యం ముగ్గురు ఉగ్రవాద మద్దతుదారులను కాల్చి చంపింది. ఒక ఉగ్రవాది స్థావరం కనుగొని అతడిని మట్టుపెట్టడానికి సైన్యం సమాయత్తమైనప్పుడు పౌరుల్లోని ఉగ్రవాద మద్దతుదారులు సైన్యంపై రాళ్లు విసరడంతో అనివార్యంగా సైన్యం జరిపిన కాల్పుల్లో ఉగ్రవాదితో పాటు మరో ముగ్గురు పౌరులు చనిపోయారు. 18 మందికి పైగా గాయపడ్డారు. 
 
మంగళవారం ఉదయం చదూరాలో ఉగ్రవాదులు ఉన్నారని తెలిసి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఎన్‌కౌంటర్‌ సమయంలో ఉగ్రవాదులకు సాయంగా జవాన్లపై స్థానికులు రాళ్లతో దాడిచేశారు. దీంతో భద్రతా దళాలు వారిపైనా కాల్పులు జరిపాయి. దీంతో ఒక ఉగ్రవాది, ముగ్గురు పౌరులు చనిపోయారు. ఆ సమయంలో హఠాత్తుగా ఉగ్రవాదుల నుంచి కాల్పులు మొదలయ్యాయి. దీంతో జవాన్లు సైతం ఎదురు కాల్పులు ప్రారంభించారు. 
 
ఇదేసమయంలో ఉగ్రవాదులను తప్పించేందుకు స్థానిక యువకులు.. జవాన్లపై రాళ్లతో విరుచుకుపడ్డారు. దీంతో వారిపైనా జవాన్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. మరణించిన స్థానికులను జహీద్‌‌డర్, సాకీబ్‌ అహ్మద్, ఇష్ఫక్‌ అహ్మద్‌వానిగా గుర్తించారు. ఇదే ఘటనలో మరో 18 మంది గాయపడ్డారు. కాగా, భద్రతా దళాలు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నందుకు నిరసనగా వేర్పాటువాదులు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
 
ఉగ్రవాద వ్యతిరేక చర్యలను అడ్డుకునేందుకు సాయుధ బలగాలను ఉగ్రవాదుల మద్దతుదారులు అడ్డుకునే  ధోరణి కొద్ది సంవత్సరాల నుంచి కశ్మీర్‌లోయలో కొనసాగుతోంది కానీ గత ఏడాది హిజ్బుల్ కమాండర్, పోస్టర్ బాయ్ బుర్హాన్ వానీని సాయుధ బలగాలు కాల్చి చంపిన తర్వాత ఇలా జనం రాళ్ల వర్షం కురిపించడం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇక లోయలోని పోలీసుల కుటుంబాలను చంపేస్తామంటూ ఉగ్రవాద సంస్థలు బెదిరించడం కూడా సహజమైపోయింది.