శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (08:56 IST)

జంతువుల నుంచే 75 శాతం ఇన్‌ఫెక్షన్లు

ఈ శతాబ్దంలో వచ్చిన సార్స్, మెర్స్, ఇన్‌ఫ్లుయెంజా వంటి వ్యాధులు జంతువుల నుంచే వ్యాప్తి చెందినట్లు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, నిపుణులు నిర్ధారించారు. పలురకాల జూనోటిక్‌ వ్యాధులు జంతువులు లేదా సూక్ష్మక్రిముల నుంచి మనుషులకు రోగాలను వ్యాపింపజేస్తాయని గుర్తించారు.

ఈ రోగాల్లో కొన్నిజంతువులను అనారోగ్యానికి గురిచేయకపోయినా, వీటి వల్ల మనుషులు మాత్రం అనారోగ్యానికి గురవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం 1,200 ఇన్‌ఫెక్షన్లు సోకేందుకు కారణమైన వ్యాధులు, రోగాల్లో 816 జూనోటిక్‌ డిసీజెస్‌ జంతువుల నుంచి (75 శాతం వరకు) వచ్చినట్లు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
స్వల్ప అస్వస్థత నుంచి తీవ్ర అనారోగ్యం దాకా..
ఈ వ్యాధులు స్వల్ప అస్వస్థత నుంచి తీవ్ర అనారోగ్యానికి కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతాయి. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాధులు సోకినప్పుడు అనుసరించాల్సిన వ్యూ హంపై ‘నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఇన్‌ వన్‌ హెల్త్‌’పేరిట ఐఐఎస్‌సీ బెంగళూరు ప్రొఫెసర్‌ జి.పద్మనాభన్‌ నేతృత్వంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.

జంతువుల, సూక్ష్మక్రిముల నుంచి సోకే వైరస్‌లు, వాటి విస్తృతి, వ్యాప్తికి సంబంధించిన వివిధ అంశాలను మెరుగైన పద్ధ తుల్లో అర్థం చేసుకునేందుకు ఇది కృషి చేయనుంది. మూడేళ్ల కాలపరిమితిలో ఈ రోగాలు, వ్యాధులకు సంబంధించి ప్రాధాన్యాంశాలను గుర్తించడం తో పాటు, ఈ వైరస్‌లు మళ్లీ రాకుండా, ఇన్‌ఫెక్షన్లు మళ్లీ సోకకుండా, బయో సేఫ్టీ, బయో సెక్యురిటీకి సంబంధించిన సవాళ్లను పరిశీలించి వెంటనే చేపట్టాల్సిన చర్యలను సూచించనుంది. 
 
వాతావరణ మార్పులు, అడవులు తగ్గిపోవడం, జంతువులతో వ్యవహరించే తీరు, వలసలు, టూరిజం, పట్టణీకరణ, మనుషుల ప్రవర్తనలో మార్పులు, మారుతున్న ఆహారపు అలవాట్లు, జనాభా పెరుగుదల, సాంస్కృతిక పరమైన అంశాలు, తదితరాలు జూనోటిక్‌ వ్యాధులు రావడానికి కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
ఏయే రకాలు..
వైరస్, బ్యాక్లీరియా, శిలీంద్రాలు తదితర పరాన్న జీవులు..  వీటిలో కొన్ని దోమలు, పేలు వంటివి వ్యాప్తి చేస్తాయి.
 
వ్యాప్తి ఎలా..
⇒ గాలి ద్వారా, కలుషితమైన మాంసం తినడం 
⇒ వ్యాధి సోకిన జంతువులకు సన్నిహితంగా మెలగడం ∙ వ్యాధి సోకిన జంతువు తాకిన ఉపరితలాన్ని/ప్రాంతాన్ని ముట్టుకోవడం 
⇒ దోమలు, పేలు వంటివి కుట్టినప్పుడు ఇవే జూనోటిక్‌ వ్యాధులు.. 
⇒ ఆంథ్రాక్స్, బర్డ్‌ ఫ్లూ, బొవైన్‌ ట్యూబర్‌క్యులోసిస్, క్యాట్‌ స్క్రాచ్‌ ఫీవర్, డెంగీ ఫీవర్, ఎబోలా, ఎన్‌సెఫలైటిస్, ఫిష్‌ ట్యాంక్‌ గ్రాన్యులోమా, గ్లాండర్స్, హెపటైటిస్‌–ఈ, లెప్టోస్పైరోసిస్, లైమ్‌ డిసీజ్, మలేరియా, ప్యారట్‌ ఫీవర్, ప్లేగు, క్యూ ఫీవర్, రేబీస్, ర్యాట్‌ బైట్‌ ఫీవర్, రింగ్‌వార్మ్, స్వైన్‌ ఫ్లూ, డిప్తీరియా తదితరాలు.