శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (18:12 IST)

మానవ మృగాలకు ఇదో గుణపాఠం: చిరంజీవి

ఆడపిల్లల్ని ఆట వస్తువులుగా పరిగణించి వారిపై దారుణ ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఈ ఎన్‌కౌంటర్ ఓ గుణపాఠం కావాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు.

ఇదే `దిశ`కు నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. సత్వర న్యాయం అందించిన సీపీ సజ్జనార్‌కు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అభినందనలు తెలియజేశారు. దిశ హత్యోదంతంలో నలుగురు నిందితులు తాజా ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

"దిశ ఘటన నిందితులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం అని భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపు కోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది.

ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి. నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు వున్న పోలీస్ వ్యవస్థకి, కేసీఆర్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు" అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు.
 
సంభవామి యుగేయుగే : హోమంత్రి సుచరిత
దిశ అత్యాచార నిందితుల ఎన్​కౌంటర్​పై రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పందించారు. దిశ హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోయిందని అన్నారు. దిశకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. దిశ హత్యకేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందని రాష్ట్ర హోంమంత్రి సుచరిత అన్నారు.

నిందితుల ఎన్​కౌంటర్​పై ఆమె స్పందించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేయడం వల్ల పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని ఉద్ఘాటించారు. ఇటువంటి సంఘటనల వల్లే దిశ లాంటి ఉదంతాలు పునరావృతం కావని హోంమంత్రి అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో ధర్మాన్ని కాపాడేందుకు భగవంతుడు పుడుతుంటాడని 'పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అనే భగవద్గీత శ్లోకాన్ని ట్విట్టర్​ ఖాతాలో పోస్టు చేశారు.
 
ఆడపిల్ల తండ్రిగా సమర్థిస్తున్నా: అవంతి శ్రీనివాస్
శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. ఒక ఆడపిల్ల తండ్రిగా సమర్థిస్తున్నానన్నారు. అన్ని స్కూల్స్‌ల్లోనూ, కళాశాల్లో ఆడపిల్లల‌కు మార్షల్స్ ఆర్ట్స్ నేర్పించాలన్నారు.

దిశకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చట్టాలను మార్చి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని ఆయన తెలిపారు. ప్రతి పురుషుడు మహిళకు అండగా ఉండాలన్నారు. కాగా.. ఇటువంటి ఘటనలు గల్ఫ్‌లో జరిగితే రాళ్లతో కొట్టి చంపుతారన్న విషయాన్ని ఈ విధంగా గుర్తు చేశారు.