పెంపుడు ఎలుకను చంపినందుకు పదేళ్ల బాలికను కొట్టి చంపిన విద్యార్థి
తను పెంచుకున్న పెంపుడు ఎలుకను చంపేసిందన్న కారణంతో పదేళ్ల బాలికను 11 ఏళ్ల విద్యార్థి దారుణంగా కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో ఈ సంఘటన చోటుచేసుకున్నది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం లసూడియా పరిధిలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి 10 ఏళ్ల బాలికను తాను పెంచుకుంటున్న ఎలుకను చంపేసిందన్న అనుమానంతో బాలికతో గొడవపడ్డాడు.
అనంతరం బండరాయితో ఆమె తలపై మోది హత్య చేసి పరారయ్యాడు. ఈ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. అదుపులోకి తీసుకున్న బాలుడ్ని బాల నేరస్తుల శిక్షణాలయానికి తరలిస్తామని డీఐజీ హరినారాయణాచారి మిశ్రా తెలిపారు. అనుమానంతో బాలుడిని అదుపులోకి తీసుకోగా అసలు విషయం చెప్పినట్లు ఆయన తెలిపారు.
తాను పెంచుకుంటున్న ఎలుకను చంపేసిందన్న అనుమానంతో నిన్న బాలికతో గొడవ పడ్డాడు. అనంతరం పెద్ద రాయితో ఆమె తలపై కొట్టడంతో చిన్నారి చనిపోయిందని వివరించారు. తలపై గాయం కావడంతో రక్తస్రావం జరిగి బాలిక మరణించినట్లు డీఐజీ తెలిపారు.