బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:58 IST)

గంటకో విద్యార్థి ఆత్మహత్య - ఎక్కువగా ఆ వయసువారే...

దేశంలో గంటకో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేకపోయామని, పరీక్షల్లో ఫెయిల్ కావడం తదితర కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏదైతేనేం బంగారు భవిష్యత్తును విద్యార్థులు బలి చేసుకుంటున్నారు. వీరిలో ఎక్కువగా 10 నుంచి 12 యేళ్ల లోపు విద్యార్థులే ఉండటం గమనార్హం. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఎన్‌సీఆర్‌బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) 2019 నివేదిక వెల్లడించింది. గత 25 ఏండ్ల గణాంకాలు విశ్లేషిస్తే ఎన్నడూ లేనంతగా 2019లో 10,335 మంది విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినట్టు నివేదిక తెలిపింది. 
 
ముఖ్యంగా, 1995 నుంచి 2019 డిసెంబర్‌ 31 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 1.7 లక్షల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం ఆత్మహత్యల్లో గత పదేండ్లలోనే 52 శాతం (85,824 మంది) విద్యార్థులు అసువులబాసారు. 
 
2019లో మొత్తం 10,355 ఆత్మహత్యల్లో మహారాష్ట్ర (1,487), మధ్యప్రదేశ్‌ (927), తమిళనాడు (914), కర్నాటక (673), ఉత్తరప్రదేశ్‌ (603)ల్లో కలిపి 44 శాతం మరణాలు నమోదయ్యాయి. గతేడాదిలో తెలంగాణలో 426 మంది, ఏపీలో 383 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
 
అయితే, ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల్లో ఎక్కువగా 10 నుంచి 12 యేళ్లవారే ఎక్కువగా ఉన్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు. ఈ వయస్సుల పిల్లల్లో యాంగ్జైటీ, ఆత్రుత ఎక్కువగా ఉండి.. ఒత్తిడిని ఎలా సర్దుబాటు చేసుకోవాలో వారికి పాలుపోవడం లేదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అర్థమయ్యే రీతిలో అన్ని విషయాలను ప్రశాంతంగా వివరించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.