మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (15:53 IST)

నేనంటే నీకు పెద్దగా ఇష్టం లేనట్టుంది బావా... నాకు ఓడిపోవాలని లేదు...

తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా కొల్చారంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. సొంత బావను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆర్నెల్లకు ఆత్మహత్య చేసుకుంది. నేనంటే  పెద్దగా ఇష్టం లేనట్టుంది బావా... నాకు ఓడిపోవాలని లేదు బావా... అంటూ బలవన్మరణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొల్చారం ఉప సర్పంచి నింగొల్ల లక్ష్మి, చెన్నయ్య దంపతుల కుమార్తె నవనీత (19)... తన దూరపు బంధువు ప్రశాంత్‌ను ప్రేమించింది. నవనీతకు ప్రశాంత్ వరుసకు బావ అవుతాడు. వారి ప్రేమ ఇరు కుటుంబాల మధ్య విభేదాలకు కారణమైంది.
 
అయితే, కుటుంబ సభ్యులను ఎలాగో ఒప్పించి నవనీత, ప్రశాంత్ పెళ్లితో ఒక్కటయ్యారు. వారి పెళ్లి జరిగిన ఆర్నెల్లకే నవనీత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నవనీత రాసిన సూసైడ్ నోట్‌లో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. 'హాయ్ బావా... నేనంటే నీకు పెద్దగా ఇష్టం లేనట్టుంది. నాకంటే నీకు చాలామంది ముఖ్యమైన వాళ్లున్నారు. నాకు ఓడిపోవాలని లేదు బావా.. అయినా ఈ రోజు నా చావు కబురు వింటావు. బై బావా.. సంతోషంగా ఉండు. ఐ లవ్యూ  బావా' అంటూ పేర్కొంది.
 
దీనిపై నవనీత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె గత ఫిబ్రవరిలోనే పెళ్లి చేసుకుందని, ప్రశాంత్‌తో కాపురంలో ఆమె రెండు నెలలు మాత్రమే సంతోషంగా గడిపిందన్నారు. ఆ తర్వాత అత్తమామలు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారన్నారు. ఈ కారణంగానే తన కుమార్తె మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.