శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 మే 2017 (10:51 IST)

బీహార్ అభివృద్ధి కోసమే ప్రధానిని కలిశా : సీఎం నితీశ్ కుమార్

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవడం నా బాధ్యత. ఇపుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైనట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవడం నా బాధ్యత. ఇపుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైనట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. 
 
రాష్ట్రపతి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఇచ్చిన విందుక గైర్హాజరైన నితీశ్ కుమార్.. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విందుకు హాజరు కావడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఈ సమావేశం బీజేపీ-జేడీయూ భవిష్యత్ రాజకీయాలకు సంకేతమని భావిస్తుండగా, అటువంటిదేమీ లేదని నితిశ్ కొట్టిపారేశారు. 
 
ప్రధానితో సమావేశం తర్వాత నితీశ్ స్పందిస్తూ... ప్రధాని - ముఖ్యమంత్రి సాధారణ భేటీ అని, దీనికేమంత ప్రాధాన్యం లేదని తేల్చి చెప్పారు. జేడీయూ చీఫ్‌గా తాను ప్రధానిని కలవలేదని, ఓ ముఖ్యమంత్రిగానే ఆయనను కలిశానని స్పష్టం చేశారు. దీనిని మీడియా అనవసరంగా పెద్దది చేసి చూపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
 
లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించిన సీఎం.. నిజాలు తెలిశాకే ఈ విషయంలో స్పందిస్తానన్నారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నౌత్ గౌరవార్థం ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు నితిశ్ కుమార్‌ను ఆహ్వానించారు.