ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (11:07 IST)

అగ్నిపథ్‌పై తప్పుడు ప్రచారం - 35 వాట్సాప్ గ్రూపులపై నిషేధం

whatsapp
సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నివీరుల పథకం గురించి తప్పుడు ప్రచారం చేసిన 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ పథకానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు, హింసాత్మక సంఘటనలు, రైళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడం తదితర ఘటనల నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా, 35 వాట్సాప్ గ్రూపులపై నిషేధం విధించింది. 
 
అంతేకాకుండా ఇలాంటి ఘటనలపై వాస్తవాల తనిఖీల కోసం పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ 87997 11259 అనే నంబరులో నివేదించాలని దేశ పౌరులకు కేంద్రం సూచనలు చేసింది. ఈ నెల 17వ తేదీన బీహార్ ప్రభుత్వం తన 12 జిల్లాల్లో ఆదివారం వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన విషయం తెల్సిందే. 
 
ప్రజలను రెచ్చగొట్టేందుకు, ఆస్తిని నష్టం కలిగించే ఉద్దేశంతో పుకార్లను వ్యాప్తి చేసేందుకు అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంటూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇపుడు కేంద్రం కూడా స్పందించి అగ్నిపథ్‌పై తప్పుడు ప్రచారం చేసిన 35 వాట్సాప్ గ్రూపులను గుర్తించి నిషేధం విధించింది.