హోలీ సందర్భంగా మసీదు మూసివేత... పాక్‌లో రెండు రోజుల సెలవు
హోలీ పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ జిల్లాలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, అలీగఢ్‌లోని అత్యంత సున్నిత ప్రాంతమైన కరీమ్ చౌరస్తాలోని మసీదును మూసివేశారు. ఫలితంగా మసీదులో రంగులు వేయడం జరగదని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా హోలీ సందర్భంగా ఈ చౌరస్తాలో స్థానికుంతా కలసి హోలీ ఆడతారు.
ఈ కూడలిలో గత కొన్ని రోజులుగా పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అలీగఢ్(సిటీ) ఎస్పీ అభిషేక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హోలీ సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు సబ్జీ మండీ చౌరస్తాలోని మసీదును తాత్కాలికంగా మూసివేయించామని తెలిపారు. మత సామరస్యానికి విఘాతం కలగకుండా ఉండేందుకే ఇటువంటి చర్య తీసుకున్నామని తెలిపారు.
మరోవైపు, పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లో హోలీ సందర్భంగా రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. బలూచిస్తాన్‌లో అక్కడి మైనారిటీ వర్గమైన హిందువులు ప్రతీ యేటా హోలీ వేడుకలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం, మంగళవారం సెలవులు ప్రకటించారు. 20 కోట్ల పాకిస్థాన్ జనాభాలో హిందువులు రెండు శాతంగా ఉన్న విషయం తెల్సిందే.
అత్యధిక శాతం హిందువులు సింధ్ ప్రాంతంలో ఉన్నారు. 2016 నుంచి పాక్ ప్రభుత్వం ఇక్కడి హిందువులు హోలీ వేడుకలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. కాగా బలూచిస్తాన్ ముఖ్యమంత్రి కమాల్ ఖాన్ ఆ ప్రాంతంలోని హిందువులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ఉత్సవం వసంత రుతువుకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలోని హిందువులు ఇక్కడి సంస్కృతిలో కూడా భాగస్వాములయ్యారన్నారు.