సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (15:25 IST)

"అగ్నివీర్" రిక్రూట్మెంట్‌కు నోటిఫికేషన్ జారీ - జూలై నుంచి రిజిస్ట్రేషన్

agnipath
భారత త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ (అగ్నివీరులు) పథకం ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అగ్నివీరులు పోస్టులకు జూలై నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదేసమయంలో ఈ పథకంపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్రం తాజా నోటిఫికేషన్ ద్వారా స్పష్టం చేసింది. 
 
అగ్నివీరులుగా నియామకాలు చేపట్టే విభాగాలు, అందుకు కావాల్సిన అర్హతలను తాజా నోటిఫికేషన్‌లో వివరంగా పేర్కొంది. అంతేకాకుండా అగ్నివీరులకు ఇచ్చే వేతన ప్యాకేజీ, సెలవులు, సర్వీసు నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలను నోటిషికేషన్‌లో పొందుపరిచింది.
 
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ అగ్నిపథ్‌‌పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన త్రివిధ దళాల ఉన్నతాధికారులు.. సైన్యంలో సరాసరి వయసును తగ్గించే లక్ష్యంతోనే ఈ సంస్కరణలను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆర్మీ నేడు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
మరోవైపు వాయుసేన, ఇండియన్‌ నేవీలకు సంబంధించిన అగ్నివీరుల నియామాక నోటిఫికేషన్‌లు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే, నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లోనూ 10 శాతం చొప్పున ప్రాధాన్యం కల్పిస్తామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ నిరుద్యోగులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.