సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ నోటీసులు.. స్పందించిన అమిత్ షా
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు జారీ చేయడంపై వస్తున్న విమర్శలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. మాలిక్ గవర్నర్‌గా ఉన్న సమయంలో జరిగిన బీమా కుంభకోణం విచారణలో భాగంగానే సమన్లు జారీ అయ్యాయని వివరించారు.
ఈ వ్యవహారానికి.. భాజపా ప్రభుత్వంపై మాలిక్ చేసిన విమర్శలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయనకు సీబీఐ నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారని గుర్తు చేశారు. ప్రజల దగ్గర దాచిపెట్టే పనులేవీ భాజపా ప్రభుత్వం చేయదని అమిత్ షా అన్నారు.
ఎవరైనా వ్యక్తిగత, రాజకీయ, స్వప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. దాని వెనకున్న లక్ష్యమేంటో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పదవిలో ఉండగా మాలిక్ ఈ అంశాలను ఎందుకు లేవనెత్తలేదని ప్రశ్నించారు.
గవర్నర్ పదవి దూరం కాగానే ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మాలిక్ చేసిన ఆరోపణల్లోని విశ్వసనీయత ఏంటనేది ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
'నాకు తెలిసిన సమాచారం ప్రకారం.. రెండు లేదా మూడోసారి ఆయన్ని విచారణకు హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది. బీమా కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఏదైనా కొత్త ఆధారాలు సీబీఐకి లభించి ఉంటాయి. అందుకే మూడోసారి మాలిక్‌ను పిలిచి ఉంటారు. మాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే సీబీఐ నోటీసులు అందాయనడంలో ఎలాంటి వాస్తవం లేదు' అని ఆయన వివరణ ఇచ్చారు.
మరోవైపు సత్యపాల్ మాలిక్ శనివారం ఢిల్లీలోని ఆర్‌కే పురం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దక్షిణ ఢిల్లీలోని పార్కులో సమావేశానికి తమకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కొందరు రైతు, ఖాప్ నేతలతో కలిసి వచ్చిన ఆయన ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారనే వార్తలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే తాము అరెస్టు చేయలేదని, ఆయనే వచ్చారని, వెళ్లారని పోలీసులు స్పష్టం చేశారు. 1