శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 22 జూన్ 2017 (03:54 IST)

ఆరునెలలుగా మాట్లాడుకోని కుంబ్లే, కోహ్లీ.. బీసీసీఐ నిద్రపోతోందా.. టీమిండియాలో ఏం జరుగుతోంది?

భారత క్రికెట్ చరిత్రలో ఇంతకు మించిన షాకింగ్ న్యూస్ మరొకటి ఉండదు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వరకు ఆరునెలలుగా టీమిండియా కెప్టెన్, కోచ్‌ మధ్య మాటలు లేవన్న షాకింగ్ వార్తను బీసీసీఐ చాలా లేటుగా బయటపెట్టింది. కెప్టెన్ కోహ్లీకి, తనకు మధ్

భారత క్రికెట్ చరిత్రలో ఇంతకు మించిన షాకింగ్ న్యూస్ మరొకటి ఉండదు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వరకు ఆరునెలలుగా టీమిండియా కెప్టెన్, కోచ్‌ మధ్య మాటలు లేవన్న షాకింగ్ వార్తను బీసీసీఐ చాలా లేటుగా బయటపెట్టింది. కెప్టెన్ కోహ్లీకి, తనకు మధ్య విభేదాలు పూడ్చుకోలేనంద తీవ్రస్థాయికి వెళ్లాయి కాబట్టి కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నానని కుంబ్లే మంగళవారం ట్వీట్ చేసినప్పుడు క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. బీసీసీఐ కూడా వారిమధ్య లోతుగా విభేదాలు ఉన్నట్లు భావిస్తూ వచ్చింది కానీ ఆరునెలలుగా వారిమధ్య మాటలు లేవని లేటుగా తెలియడంతో చేష్ట్యలుడిగిపోయింది. 
 
కుంబ్లే పదవి పొడిగింపు విషయంలో భారత క్రికెట్ సలహా మండలి వ్యవహరించిన తీరులోనే ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తమయ్యాయి కాని అవి ఆనాటికి అంత స్పష్టత ఇవ్వలేదు. భారత క్రికెట్ దిగ్గజ త్రయం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన సలహా మండలి కుంబ్లేకి గ్రీన్ లైట్ ఇవ్వలేదని,  ఒక షరతుతోనే కుంబ్లే పదవిని పొడిగించడానికి అంగీకరించిందని కూడా చాలా లేటుగా తెలుస్తోంది. నేరుగా పదవిని పొడిగించడానికి బదులుగా కుంబ్లే తన వద్ద పెండింగులో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటేనే కోచ్‌గా పదవిలో కొనసాగుతాడని క్రికెట్ సలహా మండలి హెచ్చరించినట్లు సమాచారం. చాంపియన్ ట్రోపీలో భాగంగా లండన్‌లో ఉన్న బీసీసీఐ సీనియర్ అధికారి ఈ మొత్తం విషయాన్ని బయటపెట్టారు. 
 
బీసీసీఐ అధికారి చెప్పిన దానిని బట్టి చాంపియన్స్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ జరగడానికి ముందు టీమిండియా జట్టు బస చేసిన హోటల్‌లో విడివిడిగా మూడు సమావేశాలు జరిగాయి. వీటిలో చివరి సమావేశం కోహ్లీ, కుంబ్లే మధ్య జరిగింది. వాళ్లిద్దరి మధ్య మాటలే లేనందున ఆ చర్చలు పూర్తిగా విఫలమయ్యాయట. ఇంగ్లండా్ జట్టు భారత పర్యటన ముగిసినప్పటి నుంచి అంటే గత ఏడాది డిసెంబర్ నుంచి ఆరునెలలుగా ఆ ఇద్దరి మధ్య మాటలు లేవని తెలుస్తోంది. ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే గత ఆరునెలలుగా కనీస మాత్రంగా కూడా వీరిమధ్య కమ్యూనికేషన్ లేదన్నదే. గత ఆదివారం చాంఫియన్స్ ట్రోపీ ఫైనల్ పూర్తయిన తర్వాత ఇద్దరూ సమావేశమై తమ మధ్య సంబంధాలు కుదరవని  తేల్చేసుకున్నారు. 
 
ఇంతకూ సమస్య ఏమిటి అని బీసీసీఐని అడిగితే ఒక సీనియర్ అధికారి ఇలా చెప్పారు. అనిల్ కుంబ్లేతో మేము నేరుగా విడిగా మాట్లాడి ఏమైన సమస్య ఉందా అనడిగాం. విరాట్‍‌తో తనకెలాంటి సమస్యలూ లేవని కుంబ్లే చెప్పారు. కోచ్‌గా తన పనితీరుపై కోహ్లీకి కొన్ని విషయాలలో రిజర్వేషన్లు ఉన్నాయని కూడా కుంబ్లే చెప్పారు. అయితే వాస్తవానికి సమస్యలే కావని కుంబ్లే చెప్పారు. దీంతో బీసీసీఐ నిస్సహాయతను ఎదుర్కొంది
 
చూడండి.. పూర్తిగా బిన్న వైఖరులు కలిగిన ఇద్దరిలో  ఒకరు సమస్యలు ఉన్నాయంటున్నప్పుడు, మరొకరు సమస్యలే లేవని చెబుతున్నప్పుడు ఆ ఇద్దరూ మాత్రమే వాటిని పరిష్కరించుకోగలరు. కానీ వారిద్దరూ చర్చల బల్లవద్ద కూర్చున్న తర్వాత తమ మధ్య విభేదాలు మరమ్మతు చేయడానకి కూడా సాధ్యపడనంత దూరం వెళ్లాయని ఇద్దరికీ అర్థమైంది. అప్పటికే అనిల్ కుంబ్లేకి కూడా వెస్టిండీస్ వెళ్లడానికి టికెట్లు కూడా రిజర్వ్ చేశాము.  తన భార్య కూడా తనతో వెళ్లాల్సి ఉంది కానీ, అదంతా ఇక ముగిసిన కథే అని కుంబ్లేకి తెలిసిపోయింది అని బీసీసీఐ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. 
 
ఈ విషయంలో మరింత స్పష్టత ఇవ్వాలని మీడియా కోరింది. అప్పడు అధికారి చెప్పింది ఏమిటంటే, కెప్టెన్‌గా తనకు సంబంధించిన వ్యవహారాల్లో అనిల్ కుంబ్లే చేయి పెడుతున్నాడని కుంబ్లే భావిస్తున్నాడు. కుంబ్లే అంకిత భావం కలిగిన ప్లేయరే కావచ్చు, టీమిండియా మాజీ కేప్టెనే కావచ్చు, అతనికి తన సొంత విశ్వాసాలు, అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ చివరి మాట కేప్టెన్‌దే అవుతుంది కదా అని బీసీసీఐ అధికారి చావుకబురు చల్లగా చెప్పాడు.
 
మరో కథనం కూడా వినిపిస్తోంది. టీం ఇండియా కోచ్ అనిల్ కుంబ్లేను కెప్టెన్ విరాట్ కోహ్లీ దూషించాడని, అందుకే మనస్తాపం చెంది కుంబ్లే రాజీనామా చేశాడని కూడా అంటున్నాయి బిసిసిఐ వర్గాలు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు కోహ్లీ కుంబ్లేను దూషించాడని తెలిసింది. టీం సభ్యులతో సమావేశం జరుగుతుండగానే కోహ్లీ ఈ దూషణకు పాల్పడ్డాడని తెలిసింది. తొలుత వాదించి ఆ తర్వాత తిట్లకు దిగాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక చాలు, జట్టులో ఎవ్వరూ కుంబ్లే కొనసాగాలని కోరుకోవడం లేదని కోహ్లీ అన్నట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన కుంబ్లే రాజీనామా చేశారని తెలిసింది. కోహ్లీ మనసంతా కుంబ్లేను ఎలాగైనా పంపించాలనే విషయంపైనే ఉండటం వల్ల ఫైనల్ పోరులో భారత్ ఓడిపోయిందనే వాదన వినిపిస్తోంది.
 
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గౌరవనీయుడు, మర్యాదస్తుడు, జెంటిల్‌మన్ అనిపించుకున్న అనిల్ కుంబ్లే కోచ్ పదవి అలా ముగిసిపోయింది.