సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (22:39 IST)

దోమలు కుడుతున్నాయా?.. అయితే ఇలా చేయండి!

దోమల నుంచి రక్షణ పొందడానికి మార్కెట్లో రకరకాల మందులు లభ్యమవుతున్నాయి. అయితే వీటన్నింటికీ మించి మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలతోనే దోమల నుంచి రక్షణ పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దామా?
 
1. కర్పూరంతో పరార్‌
సాధారణంగా దేవుడికి హారతి ఇచ్చేందుకు కర్పూరం వాడతారు. కానీ, ఓ చిన్నప్లేటులో కర్పూరాన్ని తీసుకొని, మూసిఉన్న గదిలో కనీసం 30 నిమిషాలపాటు ఉంచినట్లయితే ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయట.
 
2. వెల్లుల్లి వాసనకు ఇంటి బయటే...
అందరి వంటింట్లో వెల్లుల్లి కనిపిస్తుంది. వీటిలో దోమలను నివారించే చాలా ఔషధగుణాలున్నాయి. కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి, వాటిని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ ద్రావణాన్ని ఇంట్లో పిచికారీ చేయాలి. ఇలా చేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. అయితే ఆ ద్రావణం గాఢత కొద్దిసేపట్లోనే పోతుంది కాబట్టి.. మనం ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు.
 
 
3. కాఫీ  పౌడరుతో కనిపించకుండా పోతాయ్‌
తెల్లారితే కాఫీ తాగనిదే కొందరికి రోజు ప్రారంభం కాదు. దాదాపు అన్ని ఇళ్లల్లోనూ కాఫీ పౌడరు ఉంటుంది. దీనికి కూడా దోమల్ని తరిమే చేసే శక్తి ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నిలకడగా ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. మీ పరిసరాల్లో నీరు నిలిచిపోయినట్లయితే అందులో కొంత కాఫీ పౌడర్‌ చల్లండి. దీనివల్ల దోమ లార్వాలు చనిపోతాయి.
 
 
4. లావెండర్‌ నూనెతో దరిచేరవు
లావెండర్‌ నూనె వాసనను దోమలు భరించలేవు.అందువల్ల దీనిని దోమల నుంచి రక్షణగా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లోనూ, పరిసర ప్రాంతాల్లో లావెండర్‌ నూనెను పిచికారీ చేస్తే దోమలు దరి చేరవు. అవసరమైతే కొద్ది మొత్తంలో నూనెను చర్మానికి కూడా రాసుకోవచ్చు. కాకపోతే, ఆ వాసన భరించగలగాలి.
 
 
5. పుదీనాతో పరార్‌
పుదీనా..వంటల్లో సువాసన కోసం ఎక్కువగా వాడతాం. పుదీనా పచ్చడి కూడా ఎంతో ఆరోగ్యకరం. ఎన్నో ఔషధ గుణాలు దీని సొంతం. ఈ ఆకులంటే దోమలు ఆమడ దూరం ఎగిరిపోతాయి. దీనిలోని ఔషధగుణాలు పరిసరాల్లో ఉండే దోమలను నివారిస్తాయి. ఇంట్లో ఏదో ఒక మూల పుదీనా ఆకుల్నిగానీ, లేదా పుదీనా ఆయిల్‌ను ఉంచినట్లయితే.. దాని నుంచి వెలువడే పరిమళం వల్ల దోమలు దరి చేరవు.