శనివారం, 8 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2025 (15:32 IST)

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

murder
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కన్నబిడ్డే కన్నతల్లిదండ్రులతో సహా మొత్తం ముగ్గురుని హత్య చేశారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి చిన్న కుమారుడే ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన పోలీసుల కథనం మేరకు...
 
ఢిల్లీలోని మైదాన్ గఢీలోని ఓ ఇంట్లో నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ప్రేమ్ సింగ్ (45-50), ఆయన పెద్ద కుమారుడు హృతిక్ (24) రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. మొదటి అంతస్తులో ప్రేమ్ సింగ్ భార్య రజని (40-45) మృతదేహం లభ్యమైంది. ఆమె నోటికి గుడ్డ కట్టి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
ఘటన జరిగినప్పటి నుంచి వారి చిన్న కుమారుడు సిద్ధార్థ్ (22-23) కనిపించకుండా పోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారం మేరకు సిద్ధార్థ్ గత 12 సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. అతనికి తీవ్రమైన కోపం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) వంటి సమస్యలు ఉన్నట్టు ఇంట్లో లభించిన పత్రాల ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇందుకోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐహెచ్బీఏఎస్)లో చికిత్స పొందుతున్నట్టు ప్రిస్క్రిప్షన్స్‌ను బట్టి తెలుస్తోంది.
 
కత్తులతో పొడిచి, ఇటుకలు, రాళ్లతో కొట్టి ముగ్గురినీ సిద్ధార్థ్ అత్యంత కిరాతకంగా చంపి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అంతేకాకుండా "తన కుటుంబాన్ని తానే చంపేశానని, ఇకపై ఆ ఇంట్లో ఉండనని" సిద్ధార్థ్ ఎవరితోనో చెప్పినట్టు కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. మృతుడైన ప్రేమ్ సింగ్‌కు మద్యం సేవించే అలవాటు ఉందని, ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని గ్రామ ప్రధాన్ మహమ్మద్ షకీల్ అహ్మద్ ఖాన్ తెలిపారు.
 
ప్రస్తుతం పోలీసులు ఇంటిని సీల్ చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరిస్తున్నాయి. పరారీలో ఉన్న నిందితుడు సిద్ధార్థ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.