గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (17:27 IST)

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేం : సుప్రీంకోర్టు

arvind kejriwal
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశంపై సీబీఐ ఈ నెల 23వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి కేసు విచారణను 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జలు భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, కేజ్రీవాల్ అనారోగ్య కారణాల దృష్ట్యా పిటిషన్‌ను తక్షణం విచారించాలంటూ ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ చేసిన వినతిని అంగీరించింది. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ, మనీలాండరింగ్ కింద కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో సీబీఐ అరెస్టు చేసిందని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తుల ధర్మాసనం ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని స్పష్టం చేసింది. 
 
అంతకుముందు ఆగస్టు 5వ తేదీన కేజ్రీవాల్ అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్థించిన విషయం తెల్సిందే. ఆయన అరెస్టు చట్టబద్ధమైనదేనని తీర్పు చెప్పింది. సీబీఐ కేసులో ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కేజ్రీవాల్‌కు సూచించింది. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్టు జరిగిందని అభిప్రాయపడింది.