గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (12:44 IST)

ఆజంఖాన్ కుమారుడి నోటిదురుసు జయప్రదను ''అనార్కలి''గా?

ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి ఆజంఖాన్‌ తరహాలోనే ఆయన కుమారుడు అబ్ధుల్లా కూడా నోటి దురుసు ఎక్కువని నిరూపిస్తున్నారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలంటే ఆజంఖాన్ ముందుంటారు. ఇదే తరహాలో అబ్ధుల్లా కూడా ప్రస్తుతం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 
 
ఇప్పటికే ఆజంఖాన్ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జయప్రదపై కూడా ఇటీవల దారుణ వ్యాఖ్యలు చేశారు. ఖాకీ డ్రాయర్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కుమారుడు అబ్దుల్లా కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నట్టున్నాడు. పాన్ దరేబా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, జయప్రదపై పరోక్ష విమర్శలు చేశాడు. తమకు అలీ, భజరంగబలీలు కావాలి కాని... అనార్కలి వద్దంటూ వ్యాఖ్యానించాడు. 
 
ఈ నేపథ్యంలో తనను 'అనార్కలి'గా అభివర్ణించిన ఎస్పీ నేత ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాపై జయప్రద మండిపడ్డారు. అబ్దుల్లా వ్యాఖ్యల పట్ల నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని చెప్పారు. తండ్రికి తగ్గట్టే కొడుకు కూడా ఉన్నాడని దుయ్యబట్టారు. విద్యావంతుడైన అబ్దుల్లా ఇలా మాట్లాడటం సరికాదన్నారు.
 
ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున జయప్రద పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెపై ఎస్పీ నేత ఆజంఖాన్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.