మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:57 IST)

ఉలుందూరు పేట లో శ్రీవారి ఆలయ నిర్మాణం వైభవంగా భూమి పూజ

తమిళనాడు రాష్ట్రం  ఉలుందురు పేటలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. అర్చకులు సంకల్పం, పుణ్యాహవాచనం, గణపతి పూజ,విష్వక్సేన పూజ నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య నవధాన్యాలను భూమిలో ఉంచి ఆలయనిర్మాణానికి నాలుగు ఇటుకలు ఉంచి నాలుగు వేదాలను ఆవాహనం చేశారు.

24 బెత్తలు ( 18 అంగుళాలు) భూమిలో ఈ ఇటుకలు ఉంచి ప్రత్యేకంగా శిలాన్యాస పూజలు చేశారు. భూమి పూజ సందర్బంగా స్థానిక శాసన సభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు కుమరగురు భారీ ఏర్పాట్లు చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి యెడపాటి పళని స్వామి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, శాసన సభ్యులు కుమరగురు దంపతులు, టీటీడీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి, పలువురు శాసన సభ్యులు,  టీటీడీ చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, డాక్టర్ సునీల్  తో పాటు వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ఆలయ నిర్మాణం ఇలా...
ఉలందురు పేట ఎమ్మెల్యే,  టీటీడీ బోర్డ్ సభ్యులు శ్రీ కుమారగురు  ఆలయ నిర్మాణం కోసం 3 ఎకరాల 98 సెంట్ల భూమి దానంగా ఇచ్చారు.  దీంతో పాటు ఆలయ నిర్మాణానికి 3 కోట్ల 16 లక్షల రూపాయలు విరాళాల ద్వారా అందించారు.
 
ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారు,  శ్రీ ఆండాల్ అమ్మవారి ఉప ఆలయాలు నిర్మించనున్నారు.   ఆలయం చుట్టూ ప్రహరీ గోడ, పోటు, ఆఫీసు, స్టోర్ రూము తో పాటు భక్తులకు సదుపాయంగా పార్కింగ్  ఏర్పాటు చేస్తున్నారు.