శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:13 IST)

ముంబైలో శ్రీవారి ఆలయానికి భూమి ఇస్తాం: మహారాష్ట్ర సి ఎం ఉద్ధవ్ ఠాక్రే హామీ

ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని, ఎస్వీబీసీ హింది చానల్ కు సహకరిస్తామని మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి హామీ ఇచ్చారు.
 
ముంబైలో మంగళవారం రాత్రి అదనపు ఈవో  ధర్మారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్ తో పాటు సుబ్బారెడ్డి సిఎం ను కలిశారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి సహకారం అందించాలని సీఎం ను చైర్మన్ కోరారు.

గత ప్రభుత్వం కేటాయించిన భూమి పరిశీలించాలని, అది అనువుగా లేదనుకుంటే ఇంకో చోట భూమి కేటాయిస్తామని ఠాక్రే చెప్పారు. ఎస్వీబీసీ హింది చానల్ ను ఉగాదికి ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చైర్మన్ వివరించారు.

హిందూ ధర్మ ప్రచారం కోసం చానల్ కు కూడా ప్రభుత్వ సహకారం అందించాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని సిఎం చెప్పారు.

టీటీడీ చేపట్టిన ధార్మిక కార్యక్రమాల గురించి సిఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సుబ్బారెడ్డి సిఎం కు స్వామి వారి ప్రసాదాలు అందించి శేష వస్త్రంతో సన్మానించారు.
 
అన్ని విధాలా సహకరిస్తాం :  ముంబై సలహామండలి హామీ
ముంబైలో శ్రీవారి ఆలయం, ఎస్వీబీసీ హింది చానల్ ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని స్థానిక సలహామండలి సభ్యులు హామీ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి,ఎస్వీబీసీ సిఈవో  సురేష్ కుమార్ సలహామండలి సభ్యులతో సమావేశమయ్యారు.

ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ముంబైలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.