శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 నవంబరు 2015 (10:39 IST)

బీహార్ అసెంబ్లీ విజేతల్లో 161 మంది కోటీశ్వరులు.. మహాకూటమి నుంచే 122 మంది...

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో నేరచరితులు ఏవిధంగా ఉన్నారో.. అంతకంటే ఎక్కువ సంఖ్యలో కోటీశ్వరులు ఉండటం గమనార్హం. రాష్ట్ర శాసనసభ మొత్తం 243 మంది విజేతల్లో 161 మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో మహాకూటమి నుంచి 122 మంది అభ్యర్థులు ఉండగా, ఎన్డీయే కూటమికి చెందిన విజేతలు 36 మంది, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు ముగ్గురు ఉండటం గమనార్హం. 
 
జేడీయూ - ఆర్జేడీ నేతృత్వంలోని లౌకిక మహాకూటమి నుంచి బరిలోకి దిగిన అభ్యర్థుల్లో 167 మంది కోటీశ్వరులే. వీరిలో 122 మంది విజయం సాధించారు. అంటే.. మొత్తం సంపన్న అభ్యర్థుల్లో దాదాపు 73.05 శాతం మంది విజయం సాధించారు. ఇక.. ఎన్‌డీఏ కూటమి నుంచి 158 మంది కోట్లకు పడగెత్తిన అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో.. 36 మంది మాత్రమే విజయం సాధించారు. అంటే.. ఎన్‌డీఏ బరిలో నిలిపిన సంపన్న అభ్యర్థుల్లో 22.78 శాతం మంది అభ్యర్థులే విజయం సాధించారు. 
 
ఇక.. మిగిలిన వారిలో 534 మంది కోటీశ్వరులైన అభ్యర్థులు ఉంటే కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించటం గమనార్హం. ఇతరులుగా బరిలోకి దిగిన అభ్యర్థుల్లో కేవలం 0.56 శాతం మంది మాత్రమే విజయం సాధించారు. ఎన్నికల్లో గెలుపొందిన సంపన్న అభ్యర్థుల్లో ఖగారియా నియోజకవర్గం నుంచి గెలుపొందిన పూనమ్‌దేవీ యాదవ్‌ (జేడీయూ) రూ.41 కోట్లతో మొదటిస్థానంలో నిలిచారు. భాగల్పూర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అజిత్‌ శర్మ (కాంగ్రెస్‌) రూ.40.57 కోట్ల ఎక్కువ ఆస్తులున్న వారిలో రెండోస్థానంలో నిలిచారు. ఈ లెక్కల్ని బట్టి చూస్తే డబ్బున్న మారాజులే బీహార్‌ బరిలో విజేతలుగా నిలిచినట్లు కనిపిస్తుంది.