మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (08:33 IST)

పుదువైలో బీజేపీ మెలిక : ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టు!

రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అపుడే రాజకీయ రగడ మొదలైంది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుదుచ్చేరి కూడా ఒకటి. మొత్తం 30 సీట్లున్న పుదుచ్చేరిలో రెండు కూటములు పోటీపడ్డాయి. ముఖ్యంగా, మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి, బీజేపీ, అన్నాడీఎంకే సారథ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి, డీఎంకే - కాంగ్రెస్ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. 
 
అయితే, ఆదివారం ఫలితాలు వెలవడగా, రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 6, డీఎంకే 6, కాంగ్రెస్ 2, స్వతంత్ర అభ్యర్థులు 6 స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు 16 మంది ఎమ్మెల్యేల అవసరం కాగా, ఎన్డీయేదే అధికారమని తేలిపోయింది. 
 
అయితే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రంగస్వామి సిద్ధమవుతుండగా, బీజేపీ మెలికపెట్టింది. ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని పట్టుబడుతోంది. అయితే, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, తానే ముఖ్యమంత్రినని, అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమని రంగస్వామి తెగేసి చెప్పారు. దీంతో బీజేపీ వెనక్కి తగ్గింది. 
 
అదేసమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు కలిసి కూటమి సభ్యులు కోరారు. కాగా, ఈ ఎన్నికల్లో యానాం నుంచి కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన గొల్లపల్లి అశోక్ ఏకంగా సీఎం అభ్యర్థి రంగస్వామిపైనే విజయం సాధించడం విశేషం.