బెంగాల్ దంగల్ : హ్యాట్రిక్ దిశగా టీఎంసీ.. మమతా బెనర్జీ వెనుకంజ
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఓట్ల లెక్కింపు ఆదివారం మొదలుపెట్టారు. ఈ ఫలితాల్లో ముచ్చటగా మూడోసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ అధికార పీఠాన్ని అధిగమించే దిశగా సాగుతోంది.
ఎనిమిది విడతలుగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న ఆమె నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 167 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే, బీజేపీ 113 చోట్లఇతరులు 6 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో 10 స్థానాల్లో ఇంకా తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి కాలేదు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, ఆ సంఖ్యను టీఎంసీ దాటిపోయింది. మరో 10 చోట్ల ట్రెండ్స్ రావాల్సి వుండగా, వాటిలో సగం సీట్లలో ఆధిక్యం సాధించినా.. గతంలోకంటే అధిక సీట్లను టీఎంసీ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ఫలితాల సరళిలో అనూహ్య మార్పులు సంభవిస్తే తప్ప తృణమూల్ అధికారంలోకి రాకుండా ఆపలేరని భావించవచ్చు.
మరోవైపు, తాను పోటీ చేసిన నందిగ్రామ్ స్థానంలో మమతా బెనర్జీ కాస్త వెనుకబడ్డారు. ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేంధు అధికారి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇకపోతే, తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 118 మేజిక్ ఫిగర్ కాగా, డీఎంకే ఒంటరిగా 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దాని మిత్రపక్షాలు 21 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అన్నాడీఎంకే 86 చోట్ల, పీఎంకే 5 చోట్ల, బీజేపీ 5 చోట్ల ఇతరులు ఒక స్థానంలో అధిక్యంలో వుంది.