శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (12:04 IST)

బ్రాహ్మణులు - బనియాలు తమ జేబులోని వ్యక్తులు : బీజేపీ నేత

బ్రాహ్మణులు, బనియాలపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు వర్గాలకు చెందిన ప్రజలు తమ జేబులోని వ్యక్తులంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జిగా ఉన్న మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. 
 
భోపాల్‌లో ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఆయన నోరుజారారు. బ్రాహ్మణులు, బనియాలు తమ జేబులోని వ్యక్తులు అంటూ వ్యాఖ్యానించారు. ఈ రెండు సామాజిక వర్గాల నుంచి ఎక్కువ మంది ప్రజలు బీజేపీలో ఉంటే మీడియా కూడా తమ పార్టీని బ్రాహ్మణ, బనియా పార్టీగా పిలుస్తుందని.. అయితే బీజేపీ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును కోరుకుంటుందన్నారు. 
 
అయితే బ్రాహ్మణులు తమ జేబులో ఉన్నారన్న మురళీధర్‌రావు వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. మురళీధర్‌రావు వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని.. బ్రాహ్మణులు, బనియాలను ఆ పార్టీ అవమానించిందని మండిపడ్డారు. పార్టీ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వర్గాల పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత ఇదేనని ఆయన విమర్శించారు.