శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (11:34 IST)

అమిత్ షా వారసుడుగా జేపీ నడ్డా... చేతికి బీజేపీ పగ్గాలు!?

కాషాయ దండు కొత్త అధిపతిగా జేపీ నడ్డా నియమితులుకానున్నారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి అయ్యారు. ఫలితంగా ఆయన స్థానంలో కొత్త వారసుడుని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
దీంతో ఆయన వారసుడుగా కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న జేపీ నడ్డా ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. గతంలో ఆ రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశారు. 
 
58 యేళ్ళ జేపీ నడ్డా నిరాడంబరతకు మారుపేరు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు అత్యంత విశ్వాసపాత్రుడు. అందుకే 2014లో కేంద్ర ఆరోగ్యమంత్రిగా ఉన్నప్పటికీ నడ్డానే బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు కార్యదర్శిగా కొనసాగించారు. 
 
సార్వత్రిక ఎన్నికల వేళ అత్యంత కీలకమైన ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి బీజేపీకి గట్టి సవాలుగా మారింది. అయినా యూపీ రాష్ట్ర ఎన్నికల బాధ్యతలను జేపీ నడ్డాకు అప్పగించారు. ఫలితంగా 80 స్థానాలకు గాను 62 సీట్లను బీజేపీ గెలుచుకుంది. 
 
దీంతో నడ్డా పట్ల మోడీకి అమితమైన విశ్వాసం ఏర్పడింది. భాజపా అధ్యక్ష బాధ్యతలు చేపడితే నడ్డా చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ యేడాది చివరిలో మూడు రాష్ట్రాలకు, 2020లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడపాల్సి ఉంటుంది.