శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 30 మే 2019 (21:08 IST)

తలపాగా ధరించి రైతును తలపించిన కిషన్ రెడ్డి... ప్రమాణంలో తడబాటు...

సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు గంగాపురం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చోటుదక్కింది. దీంతో గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు.
 
అయితే, మోడీ మంత్రివర్గంలో ప్రమాణం చేసిన మంత్రుల్లో అందరికంటే కిషన్ రెడ్డి ప్రత్యేకంగా కనిపించారు. తలకి తలపాగా చుట్టుకుని రైతు వేషధారణలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ఆయన ప్రమాణం స్వీకారం హిందీలో చేస్తూ తడబడ్డారు. దీంతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తప్పును సరిదిద్దుతూ మళ్లీ చదివించారు. 
 
కాగా, బీజేపీతో కిషన్ రెడ్డికి విద్యార్థి దశ నుంచే బంధం అల్లుకుపోయింది. 1960లో రంగారెడ్డి జిల్లాలో ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారని స్వయంగా ఆయనే చెప్పుకుంటారు. 1977లో రాజకీయ రంగ ప్రవేశం చేసి, 1980లో బీజేపీ పూర్తికాలపు కార్యకర్తగా మారిపోయారు. ఆ తర్వాత 1980 నుంచి 81 వరకు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్‌గా, 1982 నుంచి 83 వరకు బీజేవైఎం కోశాధికారిగా పనిచేశారు. 
 
1986 నుంచి 90 వరకు ఉమ్మడి రాష్ట్రానికి బీజేవైఎం అధ్యక్షునిగా పనిచేశారు. 1990 నుంచి 92 వరకు బీజేవైఎం అఖిల భారత కార్యదర్శిగా కొనసాగారు. 1992 నుంచి 94 వరకు జాతీయ ఉపాధ్యక్షునిగా, 1994 నుంచి 2001 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత 2002 లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయమే కిషన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. బీజేపీ అగ్రనేతలైన అటల్ బిహారీ వాజ్‌పాయ్, ఎల్కే.అద్వానీ వంటి అగ్ర నేతతో పాటు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి స్థాయికి తీసుకెళ్లింది. 
 
మరోవైపు, ఈ మంత్రి పదవి రావడానికి ప్రధాన కారణం ఆయన 2018 డిసెంబరులో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడమే. తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఫలితంగా ఆయన ఈ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి బరిలోకి దిగిన జి.కిషన్ రెడ్డి తెరాస అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 
 
ఈ ఓటమే ఆయనకు ఇపుడు వరంలామారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేవలం నాలుగు నెలల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిషన్ రెడ్డికి మళ్లీ పోటీ చేసే అవకాశం బీజేపీ అధిష్టానం కల్పించింది. ఫలితంగా ఆయన సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడుపై 60 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫలితంగా దేశ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఆయన మంత్రిపదవి దక్కింది.