పెరుగుతున్న బ్లాక్ ఫంగస్.. హర్యానాలో 650కి పైగా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ఓ వైపు.. మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు విజృంభిస్తున్నాయి. కరోనా కేసులతో పాటు రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం అంధోళన కలిగిస్తోంది. ఉత్తర భారత దేశంలోనే బ్లాక్ ఫంగస్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. హర్యానాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో 650కి పైగా కేసులు నమోదవ్వగా, 50 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి.
బ్లాక్ ఫంగస్, కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 15 వరకు స్కూల్స్ మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మే 28 నాటికి దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో..12 వేల మందికి పైగా బ్లాక్ ఫంగస్ బారినపడినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ… మే7, 2021న ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ మొదటి కేసు బయటపడింది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిషా, తమిళనాడు రాష్ట్రాలలో రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ వ్యాధిని అంటువ్యాధుల జాబితాలో చేర్చాయి.