1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (13:52 IST)

భారత్‌లో మరొక కొత్త ఫంగస్.. పేరు.. Nasal aspergillosis.. డయాబెటిస్ రోగులకు..?

corona virus
కరోనాతో పాటు బ్లాక్, వైట్ ఫంగస్‌లు వేధిస్తుంటే.. తాజాగా వీటికి తోడు ఇప్పుడు ఒక కొత్త రకం ఫంగల్​ ఇన్ఫెక్షన్ వచ్చి చేరింది. అదే నాసల్ ఆస్పెర్‌గిలోసిస్ (Nasal aspergillosis). గుజరాత్​లోని వడోదరాలో తొలిసారి ఈ కొత్త ఫంగల్​ ఇన్ఫెక్షన్​ కేసును గుర్తించారు వైద్యులు. గోత్రి ఎస్‌ఎస్‌జి వైద్య కళాశాలకు అనుబంధంగా పనిచేసే రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 262 మంది రోగులు మ్యూకోర్‌మైకోసిస్‌ (బ్లాక్​ ఫంగస్​)కు చికిత్స పొందుతుండగా.. వారిలో 8 మందికి ఆస్పెర్‌గిలోసిస్ ఫంగస్​ లక్షణాలు బయటపడ్డాయి. 
 
ఈ కొత్త రకం ఫంగల్​ ఇన్ఫెక్షన్​పై కోవిడ్ -19 సలహాదారు డాక్టర్ షీటల్ మిస్త్రీ మాట్లాడుతూ, 'ఈ పల్మనరీ ఆస్పర్‌గిలోసిస్ అనే ఫంగల్​ ఇన్ఫెక్షన్​ సాధారణంగా రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో కనిపిస్తుంది. ఆస్పర్‌గిలోసిస్ అనేది చాలా అరుదైన ఫంగల్​ ఇన్ఫెక్షన్​. ఇది కోవిడ్ నుంచి కోలుకున్న లేదా చికిత్స పొందుతున్న రోగుల్లో వచ్చే అవకాశం ఉంది. 
 
ఆస్పెర్‌గిలోసిస్ ఇన్ఫెక్షన్​ ముకోర్‌మైకోసిస్ వలె మ్యుటిలేటింగ్ ఇన్ఫెక్షన్​ కానప్పటికీ, ఇది ఇన్వాసివ్ ఇన్ఫెక్షన్​గా చెప్పవచ్చు. ఇప్పుడు బయటపడుతున్న ఫంగల్ ఇన్ఫెక్షన్లు రినో-ఆర్బిటల్- సెరిబ్రల్ పాసేజ్‌లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్నిఅరుదైన ఇన్ఫెక్షన్​గా భావిస్తున్నాం' అని అన్నారు. 
 
కోవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లను మితిమీరి వినియోగిస్తున్నారు. దీనితో పాటు ఆక్సిజన్ సరఫరాను హైడ్రేట్ చేయడానికి నాన్​ స్టెరైల్ వాటర్​ కూడా విపరీతంగా వినియోగిస్తున్నారు. ఈ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతున్నాయని మిస్త్రీ చెబుతున్నారు.
 
ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా డయాబెటిస్ ఉన్న రోగులకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. రక్తంలో తక్కువ లింఫోసైట్లు (లింఫోపెనియా) ఉన్నవారిలో కూడాలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. 
 
అందువల్ల, ప్రారంభంలోనే దీన్ని కనుగొని చికిత్స చేయించుకోవాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ ఆస్పర్‌గిలోసిస్‌ ఫంగస్ రంగును ఇంకా వర్గీకరించలేదు. దీనిని వైట్​ లేదా యెల్లో ఫంగస్​గా పిలుస్తున్నాం. కానీ ఇది వేర్వేరు రంగులలో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది గోధుమ, నీలం-ఆకుపచ్చ, పసుపు- ఆకుపచ్చ, ఆకుపచ్చ, బూడిద రంగుల్లో కనిపిస్తుంది. 
 
ఈ ఫంగస్​లన్నింటికీ యాంఫోటెరిసిన్-బి ఉపయోగించి ఒకే విధమైన చికిత్స చేస్తారు. ఈ ఫంగస్​ లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఆలస్యం చేస్తే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.