1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 మే 2021 (10:22 IST)

తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్.. ఆరుగురు మృతి

తెలుగు రాష్ట్రాలను బ్లాక్‌ ఫంగస్‌ వణికిస్తోంది. కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణను ఫంగస్‌ టెన్షన్‌ పెడుతోంది. వైరస్‌ బారిన పడి ప్రాణాలు దక్కించుకున్నా.. ఫంగస్‌ ప్రాణాలు ప్రాణాలు తీస్తోంది. ఇప్పటివరకు బ్లాక్‌ ఫంగస్ బారిన పడి ఏపీలో ముగ్గురు.. తెలంగాణలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దేశంలో ముందుగా గుజరాత్‌లో కనిపించిన బ్లాక్‌ ఫంగస్ తర్వాత ఢిల్లీ, మహారాష్ట్రకూ పాకింది. 
 
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల కూడా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదుకావడం భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ను లక్షణాలను వైద్యులు గుర్తించారు. ఆంధప్రదేశ్‌లో బ్లాక్ ఫంగస్‌తో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. 
 
గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడు, కర్నూలుకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, కర్నూలు సర్వజన ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స తీసుకొని కోలుకున్నారు. తర్వాత బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే ఆ ఇద్దరూ కన్నుమూశారు. కర్నూలుకు చెందిన మరో యువకుడు హైదరాబాద్‌ ఆస్పత్రిలో బ్లాక్‌ ఫంగస్‌తో మరణించాడు. 
 
శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన అంజిబాబుకు బ్లాక్‌ పంగస్ సోకి ఓ కన్ను వాచింది. తన భర్తకు ట్రీట్‌మెంట్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు అంజిబాబు భార్య.
 
తెలంగాణలో ఖమ్మం, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున బ్లాక్‌ ఫంగస్‌తో చనిపోయారు. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులను కోఠి ఈ.ఎన్.టీ ఆస్పత్రి నోడల్ కేంద్రం నుంచి వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. కంటి సమస్య ఉన్నవారికి సరోజనీదేవి కంటి ఆస్పత్రి వైద్యులతో ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు.