బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 31 మే 2021 (17:24 IST)

శశికళ రీ-ఎంట్రీ - మరి పన్నీరు, పళని దారెటు?

చిన్నమ్మ శశికళ. జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకే పార్టీలో చక్రం తిప్పుతూ వచ్చారు. అది కూడా కొన్నిరోజుల పాటే. అక్రమాస్తుల కేసులో చివరకు జైలుకు వెళ్ళొచ్చారు. రెండునెలల క్రితమే జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత తమిళ రాజకీయాల్లో నవశకం ప్రారంభమైందని తమిళ విశ్లేషకులు భావించారు.
 
అప్పటివరకు పార్టీలో ఇద్దరే ఇద్దరు నేతలు ఉండడం.. అందులోను పళణిస్వామి, పన్నీరుసెల్వంలు మాత్రమే ముఖ్య నేతలుగా వ్యవహరిస్తుండడం తెలిసిందే. తను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఆ కుర్చీలో కూర్చున్న పళణిస్వామి కూడా తనను పార్టీ నుంచి బహిష్కరిస్తుంటే పట్టించుకోకపోవడంపై చిన్నమ్మ కోపంతో ఉన్నారు.
 
ఇదంతా ఒక్కసారిగా పళణిపై రివేంజ్ తీర్చుకుందామని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె హోసూరు నుంచి తమిళనాడుకు వచ్చారు కానీ రాజకీయాల నుంచి మాత్రం తప్పుకుంటున్నట్లు చెప్పారు. దీంతో పళణిస్వామి, పన్నీరుసెల్వంలు ఊపిరిపీల్చుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లోని పళణిస్వామి, పన్నీరుసెల్వంలే వ్యూహ, ప్రతివ్యూహాలు వెళ్ళి చివరికి బోల్తాపడి ఓడిపోయారు.
 
పార్టీ పరిస్థితి బాగా లేదంటూ నిన్న శశికళ అన్నాడిఎంకేలోని కొంతమంది ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం ఆ ఆడియో టేపు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నేను మళ్ళీ వస్తున్నా.. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది. 
 
కొంతమంది పార్టీలో తమ స్వార్థం చూసుకుంటున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో నూతన ఉత్తేజం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తమిళప్రజలు అన్నాడిఎంకేను నమ్మాలి.. అలా చేయాల్సిన బాధ్యత నాపై ఉందంటూ చెప్పుకొచ్చారు శశికళ. 
 
అయితే శశికళ మళ్ళీ పార్టీలోకి రావడాన్ని ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు పళణిస్వామి, పన్నీరుసెల్వం. ఇది ఇప్పటిది కాదు. ఆమె జైలుకు వెళ్ళినప్పటి నుంచి ఇదే నడుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ ఏ విధంగా వారిని ఎదుర్కొని పార్టీలోకి వెళుతుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. కానీ అన్నాడిఎంకేలో తన రాకను కోరుకునే వారు 80 శాతంమంది ఉన్నారని చెబుతోంది శశికళ.