1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (08:45 IST)

శశికళ ఓటు తొలగింపు : చెన్నైలో ఇల్లు లేదనీ..

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియ నెచ్చెలి శశికళకు ఓటు లేకుండా పోయింది. ఆమె నివసిస్తూ వచ్చిన ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో శశికళకు చెన్నై నగరంలో ఇల్లు లేదన్న కారణంతో ఎన్నికల సంఘం అధికారులు ఓటును తొలగించారు. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన జయలలిత నెచ్చెలి శశికళ పేరు ఓటరు జాబితా నుంచి గల్లంతైంది. రాష్ట్రంలో నేడు ఎన్నికలు ప్రారంభం కాగా, ఓటరు జాబితాలో పేరు లేని కారణంగా శశికళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోయారు. 
 
మూడు దశాబ్దాలుగా పోయెస్ గార్డెన్ చిరునామాలోనే ఉంటున్న శశికళ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటు వేస్తున్నారు. అయితే, అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకు వెళ్లిన తర్వాత జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 
 
దీంతో అక్కడే నివసిస్తున్న శశికళ, ఇళవరసి సహా 19 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమకు తిరిగి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ శశికళ, ఇళవరసి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. 
 
జయలలిత ఉన్న సమయంలో రాష్ట్ర రాజకీయాలను శాసించిన శశికళ.. ఇపుడు ఓటు హక్కు కూడా లేకుండా చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, శశికళ పేరును జాబితాలో చేర్చకపోవడంపై థౌజండ్ లైట్స్ ఏఎంఎంకే అభ్యర్థి వైద్యనాథన్ సోమవారం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.