బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (12:15 IST)

తమిళనాడులో ప్రవహిస్తున్న నోట్ల కట్టలు: ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఇంట్లో కోటి రూపాయలు

తమిళనాడు రాష్ట్ర శాసనసభకు వచ్చే నెల ఆరో తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థిలు నానా తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో నోట్ల కట్టలు కుప్పలుగా బయటపడుతున్నాయి. తాజాగా అక్కడ ఐటీ అధికారులు జరిపిన దాడిలో కోటి రూపాయల నగదు బయటపడింది. 
 
అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఆర్.చంద్రశేఖర్ కారు డ్రైవర్ అలగర్‌స్వామి ఇంట్లో భారీ స్థాయిలో డబ్బు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఐటీ శాఖ అధికారులు.. అతని ఇంటిపై దాడి చేశారు. ఈ తనిఖీలో అధికారులు పెద్ద మొత్తంలో నగదును గుర్తించారు. 
 
దాదాపు కోటి రూపాయల నగదును గుర్తించిన అధికారులు.. లెక్కలు చూపాలంటూ ఎమ్మెల్యే డ్రైవర్‌ను అడిగారు. ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.
 
ఎస్పీ జయచంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘సోమవారం రాత్రి చంద్రశేఖర్ అనుచరుడి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడి చేసింది. చంద్రశేఖర్‌ వద్ద చాలా కాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్న వలసుపట్టికి చెందిన అలగర్‌స్వామి(38) ఇంటిపై జరిపిన దాడిలో సరైన పత్రాలు లేకుండా ఉంచిన కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 500 రూపాయల నోట్ల రూపంలో ఈ డబ్బు కట్టలు ఉన్నాయి. 
 
అలాగే, వళసుపట్టికి చెందిన తంగపండియన్ (56), కొట్టైపట్టికి చెందిన ఆనంద్ (32) అలియాస్ మురుగనంతం ఇళ్లపై కూడా ఐటి శాఖ దాడులు చేసినప్పటికీ అక్కడ ఏమీ దొరకలేదు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని సమాచారం అందిన నేపథ్యంలో తిరుచ్చి ఆదాయపు పన్ను శాఖ కో-డైరెక్టర్ మదన్ కుమార్ నేతృత్వంలో అధికారులు మూడు బృందాలుగా విడిపోయిన మూడు ప్రదేశాలపై ఏకకాలంలో దాడులు చేశారు.
 
కాగా, తమిళనాడులోని తిరుచురాపల్లి జిల్లా పరిధిలో ఉన్న మణప్పారై నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆర్ చంద్రశేఖర్.. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుచుకున్నారు. అయితే, ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు దాడులు చేశారు.Also read: