70 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని లాక్కెళ్లిన బస్సు డ్రైవర్.. అరెస్ట్
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు డ్రైవర్ మృతదేహాన్ని 70 కిలోమీటర్ల మేర బస్సుతో పాటు లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మొహినుద్ధీ
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు డ్రైవర్ మృతదేహాన్ని 70 కిలోమీటర్ల మేర బస్సుతో పాటు లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మొహినుద్ధీన్ (45) అనే బస్సు డ్రైవర్ తమిళనాడులోని కూనూర్ నుంచి నాన్-ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులో బెంగళూరుకు బయల్దేరాడు.
మైసూర్- చిన్నపట్నం మార్గం మీదుగా బెంగళూరు వెళ్తున్న క్రమంలో చిన్నపట్నం చేరుకున్నాడు. అక్కడి నుంచి శాంతి నగర్ బస్సు డిపోకు తీసుకెళ్లిన డ్రైవర్ మొహినుద్దీన్ అనంతరం బస్సును పార్క్ చేసి విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఆదివారం ఉదయం బస్సును శుభ్రం చేస్తుండగా.. బస్సు వెనుకభాగంలో మృతదేహం ఇరుక్కున్నట్లు సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.
అయితే బస్సు డ్రైవర్ మాత్రం తనకు డ్రైవింగ్‌లో పదేళ్ల అనుభవం వుందని.. ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదని విచారణలో వాపోయాడు. బస్సు వెనుక ఏదో తగిలినట్టు శబ్ధం వినిపించిందని.. రాయి అనుకుని అద్దంలో చూడగా ఏమీ కనిపించలేదని పోలీసులకు తెలిపాడు.