జయలలిత మృతిపై అనుమానాలున్నాయ్.. సీబీఐ విచారణ జరిపించాలి: తెలుగు యువశక్తి
దివంగత సీఎం జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని తమిళ తెలుగు యువశక్తి సంస్థ డిమాండ్ చేసింది. అపోలో ఆస్పత్రిలో 75 రోజులపాటు చికిత్స కొనసాగించడం, పూర్తిగా కోలుకున్నారని చెప్పిన తర్వాత గుండెపోటు కారణంగ
దివంగత సీఎం జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని తమిళ తెలుగు యువశక్తి సంస్థ డిమాండ్ చేసింది. అపోలో ఆస్పత్రిలో 75 రోజులపాటు చికిత్స కొనసాగించడం, పూర్తిగా కోలుకున్నారని చెప్పిన తర్వాత గుండెపోటు కారణంగా మరణించారని చెప్పడం నమ్మశక్యంగా లేదని, జయలలిత మరణం వెనుక దాగిన రహస్యాలను ఛేదించేందుకు సీబీఐ విచారణ జరపాలని సంస్థ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి ప్రకటించారు.
జయలలిత మరణంలోని నిజానిజాలు వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు జోక్యం చేసుకోవాలని కేతిరెడ్డి కోరారు.
జయపై స్లో పాయిజన్ ప్రయోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని, వాటిని శశికళే స్వయంగా అందజేసిందని తెలిసి 2011 డిసెంబర్‌లో శశికళను పార్టీ నుంచి తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. 2011 నుంచి ఇప్పటివరకు వరకు జయలలితపై కుట్ర జరిగిందని, ఈ విషయంలో శశికళ చర్యలు సందేహాస్పదంగా ఉన్నాయని ప్రకటనలో అనుమానం వ్యక్తం చేశారు.
ఇక జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన జయకు 75 రోజులపాటు చికిత్స కొనసాగించడంపై అనుమానాలున్నాయని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జాతీయ నాయకులు, అధికారులు, స్వయంగా గవర్నర్ వచ్చినా జయలలితను కలవడానికి అనుమతించకుండా కేవలం శశికళ మాత్రమే గదిలోకి వెళ్లడం అనుమానాలకు తావిస్తోందనిన్నారు. జయలలిత సొంత బంధువులున్నా అంత్యక్రియలు కూడా శశికళ నిర్వహించడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారని కేతిరెడ్డి అన్నారు.