బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 12 జులై 2020 (15:36 IST)

రాజస్థాన్ ప్రభుత్వంలో రగడ..ప్రభుత్వం కూల్చివేతకు కుట్ర.. అప్రమత్తమైన కాంగ్రెస్

మూడు నెలల క్రితం మధ్యప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు రాజస్థాన్ లో పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో సీనియర్‌, జూనియర్‌ నాయకుల మధ్య వివాదాల కారణంగా అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అదే పరిస్థితి ప్రస్తుతం రాజస్థాన్‌లో కూడా ఉత్పన్నమయ్యేలా పరిస్థితులు ఉన్నాయి. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌పై ఉప ముఖ్యమంత్రి, పిసిసి నేత సచిన్‌ పైలెట్‌ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తన మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీ వెళ్లాడు. సోనియాను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ యాంటి టెర్రిరిస్టు స్క్వాడ్‌ సచిన్‌ పైలెట్‌కు నోటీసులు ఇవ్వడంతో సమస్య మొదలైంది. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సచిన్‌ పైలెట్‌ ఆశోక్‌ గెహ్లాట్‌ సంగతి తేల్చుకునేందుకు ఢిల్లీ వచ్చారు. కాగా ఆశోక్‌ గెహ్లాట్‌ వర్గం మాత్రం సచిన్‌ పైలెట్‌ బిజెపితో చేతులు కలిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది.

బిజెపి ఇప్పటికే బేరసారాలు ప్రారంభించిందని, ఒక్కొ ఎమ్మెల్యేకు 15 కోట్లు ఆఫర్‌ చేసిందని, మిగిలినవారికి వేరే రూపంలో లబ్ది చేకూరుస్తామని హామీ ఇచ్చిందని వీరు ఆరోపిస్తున్నారు. 200 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 12 మంది స్వతంత్య్రసభ్యులు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. వీరుకాక వివిధ పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు.