శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (10:10 IST)

మీడియాను కొండ దించేందుకు టిటిడి కుట్ర?

పత్రికా విలేకరుల సమావేశాలకు తమకు ఆహ్వానం ఇవ్వడం లేదంటూ అనేకమంది సీనియర్ జర్నలిస్టులు, ప్రముఖ ఛానల్ ప్రతినిధులు మొఱ్ఱ పెట్టుకుంటున్నారు.

టీటీడీ గుర్తించిన 26 మంది ఉన్న జాబితాలో మిగిలిన వాళ్ళను ఎందుకు చేర్చడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. 
అసలు ఎందుకు ఈ తలనొప్పి వ్యవహారం పెట్టుకున్నారో అర్థం కావడం లేదు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్ వద్ద మీడియా సమావేశం అనంతరం వెలుపలికి వస్తూ.. తీవ్ర స్థాయిలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు టిటిడి పాలకమండలి అధ్యక్షులు వై వి సుబ్బారెడ్డి. 

అంతేకాదు... అక్కడే ఉన్న టిటిడి పౌర సంబంధాల విభాగంలోని ఓ ఎస్ డి నగేష్ ని పిలిచి "తిరుమలలో ఇంతమంది మీడియా ప్రతినిధులు అసలు ఎందుకు..? మన టి.టి.డి ఎస్వీబీసీ ఛానల్ ఉంది కదా? ఇకపై ఎలాంటి సమావేశాలను, కార్యక్రమాలను అయినా ఎస్వీబీసీ ద్వారా లైవ్ ఫీడ్ అన్ని ఛానళ్లకు ఇస్తే సరిపోతుంది కదా" అంటూ మాట్లాడారు.

ఇదీ తిరుమల మీడియాపై టిటిడి యాజమాన్యంలో ఉన్న అభిప్రాయం. తిరుమలకు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన ఏవి ధర్మారెడ్డి ప్రారంభం నుండి గతంలో తనకు ఎదురైన అనుభవాల దృష్ట్యా మీడియాకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు.

అంతేకాదు, గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర ఐ& పి ఆర్ విభాగం ఆన్ లైన్ ద్వారా అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా అందులో విలేకరులు ఎవరూ తిరుమల ప్రాంతానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా ఆన్ లైన్ లో తిరుమల కేంద్రం లేకుండా చేయడంలో అధికారులతో మాట్లాడి చక్రం తిప్పినట్లు సమాచారం ఉంది. 
 
తిరుమల కొండపై పనిచేసే మీడియా ప్రతినిధులు తమ సంస్థ అవసరాల దృష్ట్యా టిటిడి అధికారుల వద్దకు దర్శనం టిక్కెట్లు ఇతరత్రా సిఫార్సులు చేస్తుంటారు. ‌ దీన్ని ఆసరాగా తీసుకుని టీటీడీ 26 మంది ప్రతినిధులను జాబితా తయారు చేసి తిరుమలలోని పోటు విభాగం, రిసెప్షన్ విభాగం, అడిషనల్ ఈవో కార్యాలయం తదితర వాటికి పంపించారు.

ఇందులో ఎక్కడా అధికారిక ఆదేశాలు లేకుండా.. కేవలం సంస్థలు, రిపోర్టర్ ల పేర్లు జాబితా మాత్రమే రూపొందించారు. కేవలం తమకు అనుకూల వార్తలు రాస్తున్న మీడియాను ఎంచుకున్నారు, తమకు  బాగా ఊదేందుకు నలుగురు ఆస్థాన విద్వాంసులను దగ్గరకు చేరుస్తూ, వారిచేత చెప్పుడు మాటలు వింటూ మీడియాలో ఆధిపత్యాన్ని చెలాయించే విధానాన్ని నేర్చుకున్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది భక్తులు ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తున్న మీడియాకు కొండపై స్థానం లేకుండా చేసేందుకు కుట్ర జరుగుతోంది. దేవుడి పేరు చెప్పి తాము చేసే అక్రమాలు, అవినీతి బయటకు పొక్కకుండా ఉండేందుకు అధికారులు మీడియాపై నియంత్రణ పేరుతో ఆంక్షలు విధించారు.

భవిష్యత్తులో మీడియా ప్రతినిధులు కొండపై కనుమరుగయ్యే దుస్థితి ఏర్పడుతోంది. గత నాలుగు మాసాలుగా తిరుమల కొండపై మీడియా ప్రతినిధుల పట్ల విభజించు పాలించు అనే బ్రిటిష్ పాలకుల తరహాలో టిటిడి ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.

మీడియా స్వేచ్ఛకు విరుద్ధంగా టీటీడీ ధార్మిక సంస్థను తమ జేబు సంస్థగా మార్చుకుని సమావేశాలకు కొద్దిమందిని మాత్రమే అనుమతిస్తున్నారు. టీటీడీ సమాచారాన్ని కూడా కొద్ది మందికి మాత్రమే చేరవేస్తూ కొంతమంది మీడియా ప్రతినిధులు పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారు. 
 
టిటిడి అనుసరిస్తున్న ఈ తప్పుడు విధానాన్ని ఎదుర్కునేందుకు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు సిద్ధమయ్యారు. తమపట్ల వహిస్తున్న వివక్షతను వివరిస్తూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు.

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే అక్రిడిటేషన్ కార్డులు కలిగిన జర్నలిస్టులను కూడా టిటిడి ఉన్నతాధికారులు లెక్కచేయకుండా తమ ఇష్టానుసారం సుమారు 100 మంది కలిగిన మీడియా ప్రతినిధులలో కేవలం 26 మందిని మాత్రమే ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో చెప్పాలని వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అంతేకాకుండా టీటీడీకి సంబంధించిన సమాచారాన్ని అందించడంలో కొంతమంది పట్ల వివక్షత చూపడం పత్రికాస్వేచ్చకు భంగమని హైకోర్టులో సీనియర్ జర్నలిస్టులు పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఏళ్ళ తరబడి13 కు మాత్రమే పరిమితమై ఉన్న టిటిడి పాలకమండలి సభ్యుల సంఖ్య ఏకంగా రాజకీయ పునారావాసంగా మారిపోయి.. ఇప్పుడు 36కు చేరింది. అన్నమయ్య భవన్ లో సభ్యులకు కుర్చీలు చాలక, స్దలం సరిపోక భవనాన్ని విస్తరించారు.

అయితే జర్నలిస్టుల సంఖ్య మాత్రం దశాబ్దాలు దాటినా పెరగరాదని అధికారుల గట్టి అభిప్రాయమని సీనియర్ జర్నలిస్టు కోలా లక్ష్మీపతి అభిప్రాయపడ్డారు.