సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (22:54 IST)

కేరళలో మరోసారి విజృంభిస్తున్న కరోనా: సెకండ్ వేవ్ ముప్పు తొలగిపోలేదు..!

Kerala
కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 12,095 కరోనా కేసులు, 146 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,49,128కు, మొత్తం మరణాల సంఖ్య 13,505కు పెరిగింది. 
 
కాగా గత 24 గంటల్లో 10,243 కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 28,31,394కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,03,764 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
 
మరోవైపు దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌‌పై కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని చెప్పింది. కరోనా ముప్పు తొలిగిపోలేదని.. దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. కేరళ, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, చత్తీస్‌ఘడ్‌, మణిపూర్‌లో కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆరు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని కేంద్రం వివరించింది.
 
"కరోనా సెకండ్ వేవ్ ముప్పు ఇంకా తొలగలేదు. జూన్ 23-29 మధ్యలో దేశవ్యాప్తంగా 71 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతానికిపైగా ఉంది. అందువల్ల సెకండ్ వేవ్ ముప్పు ముగిసినట్లు భావించొద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం చేయకూడదు. కరోనా నిబంధనలు పాటించాడం, వేగంగా వ్యాక్సిన్ల పంపిణీతోనే మహమ్మారి నుంచి బయటపడగలం" అని కేంద్రం వివరించింది.