శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (10:35 IST)

దేశంలో పెరిగుతున్న కరోనా పాజిటివ్ మరణాలు

దేశంలో కొవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 18,522 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదేసమయంలో 418 మంది మరణించారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,66,840కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,893కి పెరిగింది. 2,15,125  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,34,822 మంది కోలుకున్నారు.
 
కాగా, సోమవారం వరకు దేశంలో మొత్తం 86,08,654 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. సోమవారం ఒక్కరోజులో 2,10,292 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. 
 
ఇదిలావుంటే, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో జూలై మొదటి వారం నుంచి లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకురావటానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవటానికి ఒకటి, రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ భేటీని నిర్వహించబోతున్నారు. 
 
ఈసారి లాక్‌డౌన్‌ మొదట 15 రోజులకు పరిమితం కానుంది. అప్పటికీ, కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రాకపోతే, మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో కఠినంగా కట్టడి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.