గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (09:40 IST)

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం... నేడు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువైంది. దీంతో అనేక ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం (ఇంటి నుంచే సేవలు) వెసులుబాటును కల్పించాయి. అయితే, ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని కల్పించింది. 
 
అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు మినహా మిగతా శాఖల ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీచేసింది. మార్చి 19 నుంచి 25 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉండనున్నాయి. ఇదే బాటలో మరికొన్ని ప్రభుత్వాలు నడిచే అవకాశాలు లేకపోలేదు. 
 
మరోవైపు, క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టికే ఇండియాలో ఆ కేసుల సంఖ్య 151కి చేరుకున్న‌ది. నోవెల్ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. గురువారం రాత్రి 8 గంట‌ల‌కు ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. 
 
క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఆ వైర‌స్‌ను ఎలా ఎదుర్కోవాల‌న్న అంశాల‌ను మోదీ దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకోనున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది. భార‌త్‌లో క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు చ‌నిపోయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. క‌రోనా మ‌హ‌మ్మారిగా మారిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించింది.