మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 12 మార్చి 2020 (16:17 IST)

కరోనా వైరస్ కల్లోలం, ఇంటి నుంచే పనిచేయండి అంటూ ట్విట్టర్ ఆదేశం

ట్విట్టర్ కీలక నిర్ణయం
కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఇంటి నుంచే పని చేయాలని( వర్క్ ఫ్రమ్ హోమ్) ఆదేశాలు జారీ చేసింది. చాప కింద నీరులా ప్రపంచ దేశాలకు పాకుతున్న కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తమ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 
 
కరోనా వైరస్ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 4,600 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు లక్షా 26 వేల మందికి పైగా బాధితులు చికిత్స పొందుతూ వున్నారు. ఇప్పటికే పలు సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించాయి. ట్విట్టర్ తొలుత అత్యధిక ప్రభావం వున్న దేశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వర్తించాలని తెలిపింది. తాజా పరిస్థితుల దృష్ట్యా ప్రపంచ వ్యాప్తంగా వున్న ఉద్యోగులందరూ ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది.